తెలంగాణ సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ విషయంలో చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు.. ఈటలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడంతో పాటు.. త్వరలో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఈటల రాజేందర్ కూడా.. ఎన్ని రోజులు జైల్లో పెడతావని ఉదయం ప్రెస్మీట్లో కేసీఆర్‌ను ప్రశ్నించారు. గతంలో పౌరసరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు.. తీసుకున్న నిర్ణయాలనూ వివాదాస్పదం చేసి కేసు పెట్టబోతున్నారని ఈటల అనుమానం వ్యక్తం చేశారు. ఈటల విషయాన్ని కేసీఆర్ చిన్న చిన్న చర్యలతో వదిలి పెట్టాలనుకోవడం లేదని.. ఆయన పూర్తిగా రాజకీయంగా ఎలాంటి అడుగులు ముందుకు వేయకుండా కట్టడి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారని చెబుతున్నారు.
దేవరయాంజాల్ భూముల విషయంలో ఇప్పటికే విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ అలా ఆదేశాలు రాగానే.. ఇలా వెళ్లి విచారణ ప్రారంభించింది. ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎలాంటి నివేదిక కావాలంటే అలా.. నివేదిక సమర్పిస్తుంది. దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే దేవరయాంజాల్ భూముల విషయాన్ని కదిలిస్తే.. అన్ని పార్టీల నేతల బండారం బయట పడుతుందని… రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ కొంత మందిపై చర్యలు తీసుకుని.. మిగతా వారిని పట్టించుకోకపోయినా భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని అంటున్నారు.
మరో వైపు ఈటల పౌరసరఫరాల మంత్రిగా ఉన్నప్పటి వ్యవహారాలుకూడా.. త్వరలో మీడియాలో ప్రముఖంగా వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా… ఈటలపై పెద్ద ఎత్తున కేసులు పెట్టి.. అరెస్టుల వరకూ వ్యవహారం వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఈటల కూడా ఆషామాషీగా ఏం లేరని.. అన్నింటికి సిద్ధమయ్యే ఉన్నారని చెబుతున్నారు. ఆయన తన నియోజకవర్గం హుజూరాబాద్‌కు ఐదారు వందల కార్లతో ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా స్వాగత కార్యక్రమాలు జరిగాయి. హుజూరాబాద్ అనుచరులు హంగామా చేశారు. కార్యకర్తలతో చర్చల తర్వాత ఆయన కీలకమైన ప్రకటనలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
కేసీఆర్ ఇంతగా పగ తీర్చుకోవడానికి అసలు ఈటల ఏం చేశారన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. ఆయన రాజకీయంగా కీలకమైన అడుగులు వేయడానికి… కేటీఆర్‌ను సీఎంగా చేయడానికి వ్యతిరేకత తెలియచేసిందుకే.., ఇలా చేస్తున్నారన్న చర్చ ప్రజల్లో ఉంది. దాని కోసమే అయితే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ.. కేసులు పెట్టి వేధించడం .. ఆస్తులపై దాడులు చేయడం ఏమిటన్న అభిప్రాయం సామాన్యుల్లో పెరిగే అవకాశం ఉంది. ఈటల-కేసీఆర్ మధ్య ఏం జరిగిందో అనేది ఇప్పుడు.. మిలియన్ డాలర్ల క్వశ్చన్‌గా మారింది.