సినిమా థియేటర్లలో ఫుట్ ఫాల్స్ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడమే మానేశారని, దాంతో.. థియేటర్లు హౌస్ ఫుల్స్ అవ్వడమే లేదని నిర్మాతలు వాపోతున్నారు. దానికీ ఓ కారణం వుంది. టికెట్ రేట్లు బాగా పెంచేయడం వల్ల.. ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు ధైర్యం చేయడం లేదు. ఎలాగూ ఓటీటీలో సినిమా వస్తుంది కదా అని రిలాక్స్ అవుతున్నారు. టికెట్ రేట్లు పెంచడం కేవలం ఓ కారణం మాత్రమే అనీ, సినిమా బాగుంటే తప్పకుండా ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని ఓ వర్గం వాదిస్తుంది. ఈ రెండు వాదనల్లో ఏది బలమైనదో ఈ సంక్రాంతి సినిమాలు తేల్చేస్తాయి.
ఈ సంక్రాంతికి 3 సినిమాలొస్తున్నాయి. మూడింటిపైనా మంచి బజ్ వుంది. సాధారణంగా పెద్ద సినిమా వస్తోందంటే టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయి. ఏపీలో ఆల్రెడీ ఉత్తర్వులు వచ్చేశాయి. తెలంగాణలో కూడా హైక్ చేశారు. కానీ ఏపీతో పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువ. రిలీజ్ అయిన తరువాతి నుంచి రేట్లు మరింత తగ్గటించారు. ‘డాకూ మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలకైతే.. తెలంగాణలో సాధారణమైన టికెట్ రేట్లే. ‘కల్కి’, ‘దేవర’, ‘పుష్ప 2’ రేట్లతో పోలిస్తే.. ఈ ధరలు మధ్యతరగతి ప్రేక్షకుడికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్టే. మరి ఇప్పుడైనా ఫుట్ ఫాల్స్ పెరుగుతాయా? జనాలు ఫ్యామిలీలతో థియేటర్లకు వస్తారా? తెలంగాణతో పోలిస్తే, ఏపీలో టికెట్ రేట్లు కాస్త ఎక్కువ. సినిమా బాగుండి, ఏపీలో ఫుట్ ఫాల్స్ తక్కువగా, తెలంగాణలో ఎక్కువగా ఉంటే.. అదంతా టికెట్ రేట్ల ప్రభావం అనుకోవాలి. రెండు చోట్లా ఒకేలా కనిపిస్తే మాత్రం అసలు టికెట్ ధరలకూ, ఫుట్ ఫాల్స్ కూ సంబంధమే లేదని నిర్దారించుకోవాలి.
తెలంగాణలో టికెట్ రేట్ల హైక్ విషయంలో కాస్త ఇబ్బంది పడే సినిమా గేమ్ ఛేంజర్ మాత్రమే. ఎందుకంటే.. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. తొలి వారంలో అనుకొన్న వసూళ్లు రావాలంటే కచ్చితంగా టికెట్ రేట్లు పెంచుకొనేందుకు అనుమతులు రావాల్సిందే. ఈ విషయంలో దిల్ రాజు కాస్త గట్టిగానే పోరాడినట్టు తెలుస్తోంది. కానీ ఫలితం రాలేదు. అర్థరాత్రి 1 గంట షో కోసం కూడా దిల్ రాజు ప్రయత్నించారు. కానీ ప్రభుత్వం ససేమీరా అంది. ఈ ఎఫెక్ట్ వసూళ్లపై గట్టిగా పడుతుంది.