ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోన్న అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో మరింత దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఆదివారం మరో నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు , ఎవరు పార్టీని వీడుతున్నారో తెలియక తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్,ఎవరు ఆ నలుగురు ఎమ్మెల్యేలు అని కలవరపాటుకు గురి అవుతోంది.
ఎమ్మెల్యేల చేరికల విషయంలో కాంగ్రెస్ చివరి వరకు సీక్రెట్ మెయింటేన్ చేస్తోంది. బీఆర్ఎస్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చేరికలకు ముహూర్తాన్ని ఖరారు చేస్తోంది. ఇటీవల ఎవరూ ఊహించని విధంగా ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకొని బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ మరోసారి ఆపార్టీకి అదే ట్రీట్మెంట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ ను వీడే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్దం పుచ్చుకోగా తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గతంలోనే ఆయన కాంగ్రెస్ లో చేరాల్సి ఉండగా..అక్కడి స్థానిక నేత సరిత తిరుపతయ్య అలకతో కృష్ణమోహన్ రెడ్డి చేరిక ఆలస్యమైంది. తాజాగా సరిత తిరుపతయ్య రాజకీయ భవిష్యత్ పై రేవంత్ హామీ ఇవ్వడం.. వారు అలకవీడటంతో తాజాగా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.
బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా, మరో నలుగురు ఎమ్మెల్యేలు చేరనుండటంతో మొత్తం కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంఖ్య పదకొండుకు చేరనుంది. అసెంబ్లీ సమావేశాలలోపే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునేలా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు మరింత పదును పెడుతున్నట్లు తాజా పరిణామాలు రూడీ చేస్తున్నాయి.