బీఆర్ఎస్ ను ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు వీడుతున్నారు. ఎప్పుడు, ఎవరు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్తారో తెలియని పరిస్టితి నెలకొంది. కొంతమంది నేతలపై బీఆర్ఎస్ అధిష్టానం అనుమానం వ్యక్తం చేసినా.. అసలు ఏమాత్రం సందేహించని నేతలు కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. పోచారం, సంజయ్ కుమార్ చేరికలను గులాబీ బాస్ అంచనా వేయలేదు.
ఊహించని విధంగా కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతుండటంతోనే.. ఎమ్మెల్యేలకు బుజ్జగింపుల పర్వాన్ని కేసీఆర్ ముగించినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు కారు దిగడంతో నెక్స్ట్ ఎవరు అన్న చర్చ జరుగుతోంది. అయితే, కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కార్యకలాపాల్లో ఎక్కడా కనిపించకుండా పోయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. పార్టీలోనే కొనసాగుతారా..? లేదా..అన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉన్న గంగుల..పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా స్పీడ్ తగ్గించేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరినా ఆయన నోరు మెదపలేదు. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రులు మాట్లాడుతున్నా గంగుల మాత్రం స్పందించకపోవడం అనుమానాలకు కారణం అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో గంగులకు సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ గతంలో టీడీపీలో పని చేసిన వారే కావడంతో గంగుల కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ, సొంత జిల్లా మంత్రి పొన్నంతో విబేధాలే గంగులను ఆలోచనలో పడేస్తున్నాయన్న టాక్ వినిపోస్తోంది.