చాణిక్య, పక్కా కమర్షియల్, రామబాణం… ఇలా వరుసగా పరాజయాల్ని ఎదుర్కొన్నాడు గోపీచంద్. తన మార్కెట్ పై కూడా ఈ పరాజయాలు భారీగా దెబ్బకొట్టాయి. గోపీచంద్ సినిమా అంటే… నిర్మాతలు, బయ్యర్లు, ఆఖరికి ప్రేక్షకులు కూడా లైట్ తీసుకొనే ప్రమాదంలో పడింది తన కెరీర్. ఇప్పుడు ‘భీమా’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈనెల 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. టీజర్, ప్రచార చిత్రాలు బాగానే ఉన్నాయి. పోలీస్‌గా గోపీచంద్ గెటప్ కూడా బాగా సెట్టయ్యింది. మేకింగ్ లో క్వాలిటీ ఉంది. దానికి తోడు… గోపీచంద్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయని, ఇంట్రవెల్ బ్యాంగ్ అదిరిపోయిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తోడు గోపీచంద్ క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉండబోతోందని టాక్. తన పాత్రలో నెగిటీవ్ షేడ్స్ కనిపిస్తాయని తెలుస్తోంది,
పురాణాలకు లింక్ ఇస్తూ, ఓ కథని చెప్పడం మంచి కమర్షియల్ టెక్నిక్. దాన్ని ఈ సినిమాలో దర్శకుడు హర్ష ఫాలో అయ్యాడు. ఏదేమైనా వరుస ఫ్లాపులకు బ్రేకులు వేయాలంటే, కచ్చితంగా ఈ సినిమాతో గోపీచంద్ హిట్టు కొట్టాల్సిందే. తనకు పూర్తి స్థాయి యాక్షన్ చిత్రాలు ఎప్పుడూ మంచి ఫలితాన్నే తీసుకొచ్చాయి. ‘భీమా’ కథలో ఆ ఎలిమెంట్స్ బలంగా ఉన్నాయి. అందుకే గోపీచంద్ కూడా ఈ సినిమాపై అంత నమ్మకం పెట్టుకొన్నాడు. గోపీచంద్ లైనప్‌లో మరో రెండు మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. అయితే అవన్నీ ‘భీమా’ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాయి.