దేశం మొత్తం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న చోట.. లోక్సభ ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. తమిళనాడులోనూ అంతే. అక్కడ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నా… ఇరవై అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. ఆ స్థానాల్లో ఫలితాలు డీఎంకేకు అనుకూలంగా వస్తే ప్రభుత్వం మారిపోయే అవకాశం ఉండటమే దీనికి కారణం. 20 శాసనసభా స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు రాష్ట్రంలో ఉత్కంఠను రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా చర్చకు అవకాశం ఇస్తున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు వన్ సైడ్ అయిపోతే, అన్ని సీట్లు డీఎంకే ఫ్రంట్ కైవసం చేసుకుంటే తమిళనాడు రాజకీయ సమీకరణాలే మారిపోయే అవకాశం ఉంది.
తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 234. దినకరన్ వర్గానికి చెందిన 18 మందిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. మరో నాలుగు ఖాళ్లీలు ఏర్పడ్డాయి. వీటిలో 20 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే సభ్యుల సంఖ్య 108గా ఉంది. కాంగ్రెస్ సభ్యులతో కలుపుకుని డీఎంకే ఫ్రంట్ బలం 98. అన్నాడీఎంకేకు ఉన్న 108 మందిలో ముగ్గురు బహిరంగంగానే దినకరన్ వర్గాన్ని సమర్థిస్తున్నారు. మరో ఇద్దరు కూడా పార్టీపై అలిగారు. బీజేపీ, అంటే అధికార పార్టీకి ఐదుగురు దూరమైనట్లేనని భావించాలి. అప్పుడు పార్టీ బలం 103కు పడిపోతుంది. ప్రభుత్వం నిలబడాలంటే 116 మంది మద్దతుండాలి. ఉపఎన్నికలు జరిగే 20 స్థానాలను డీఎంకే ఫ్రంటే గెలుచుకుంటే ఆ గ్రూప్ బలం 118కి పెరుగుతుంది. కానీ… అన్నాడీఎంకే బలం 103 వరకే ఉంటుంది.
జయలలిత లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలివి. అన్నాడీఎంకేకు కొంత కేడర్ బలం ఉన్నప్పటికీ 90 శాతం జయలలిత పరపతి మీదే అభ్యర్థులంతా గెలుస్తూ వచ్చారు. కళైంజర్ కరుణానిధి చనిపోయినప్పటికీ డీఎంకే మునుపటి లాగే బలంగా ఉంది. కరుణానిధి కాలంలోనే స్టాలిన్ మంచి నాయకుడిగా ఎదిగారు. జయలలిత లేని తమిళనాడులో డీఎంకే మాత్రమే తగిన ప్రత్యామ్నాయమన్న వాదన వినిపిస్తోంది. పళనిస్వామి అసమర్థ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని భావించే తటస్థ ఓటర్లంతా డీఎంకే వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే 20 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే ఫ్రంట్ సునాయాసంగా విజయం సాధించే వీలుంటుందని భావిస్తున్నారు. అందుకే.. ఇరవై స్థానాల్లో అత్యధికం గెలుచుకున్నా.. డీఎంకే అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోందన్న అంచనాలున్నాయి. ఒక్క సారి మెజార్టీ కోల్పోయామనే పరిస్థితి వస్తే.. అన్నాడీఎంకే నుంచి వలసలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకేలో అసంతృప్తిపరుల సంఖ్య పెరిగిపోయింది. 2021లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.