జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. వాటికి కేటాయించిన స్థలాలను వారికే ఇవ్వాలని తీర్పిచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ సర్కార్ పై పడింది. ఇప్పుడు ఆ స్థలాలను ఆలస్యం చేయకుండా ఇవ్వాల్సింది తెలగాణ ప్రభుత్వమే. గతంలో కేసీఆర్ చాలా సార్లు ఇదిగో ఇచ్చేస్తున్నామన్నారు. కానీ ఇప్పటికీ నెరవేరలేదు. సుప్రీంకోర్టులో కేసు ఉందని.. ఆ కేసు తేలగానే ఇచ్చేస్తానని చెబుతూ వస్తున్నారు. నిజానికి కేసీఆర్ ఇళ్ల స్థలాలివ్వాలనుకుంటే సుప్రీంకోర్టు తీర్పుతో పని లేదు. వేరే స్థలం ఇవ్వొచ్చు. సుప్రీంకోర్టులో ఉన్న వివాదం ల్యాండ్ మీదనే కానీ.. జర్నలిస్టులకు ఇవ్వడం మీద కాదు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు.
ఎప్పుడైనా ఎన్నికల లాంటి అవసరం వచ్చినప్పుడు జర్నలిస్టు నాయకులను పిలిపించి… గిలిగింతలు పెడతారు. ఫలానా చోట డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని.. ఆ స్థలం చూసి రావాలని పంపిస్తారు. గతంలో బుద్వేల్‌కు అలాగే పంపారు. కానీ ఏమీ ముందడుగు పడలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. కానీ తెలంగాణ సర్కార్ వైపు నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. దాదాపుగా పదమూడు వందల మంది స్థలం కేటాయించారని ప్రభుత్వానికి డబ్బులు కట్టి ఉన్నారు. వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన స్థలం ఇప్పుడు.. అత్యంత విలువైనదిగా మారింది. ఎకరం వంద కోట్లకుపైగానే బహిరంగ మార్గెట్ విలువ ఉంటుంది.
ఆ స్థలంలో ఇప్పటికే అధికార పార్టీకి దగ్గరైన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంత ఆక్రమించుకున్నారు. మరో ప్రభుత్వ పెద్దల బంధువు స్టోన్ క్రషర్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇంత ఖరీదైన ల్యాండ్ ఇవ్వడానికి కేసీఆర్ మనసొప్పుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఏదో చెబితే.. నమ్మరని.. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినందున వెంటనే స్థలాలు పంపిణీ చేయాలని జర్నలిస్టులు కోరుతున్నారు.