కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాల అంత్యక్రియలకు రూ. పదిహేను ఇవ్వాలని ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది. ఆ డబ్బులు కలెక్టర్లు మంజూరు చేస్తారు. దీనికి సంబంధించి జీవోఆర్టీటీ నెంబర్ 236ను నేడు విడుదల చేసిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ విడుదల చేశారు. అవసరం అయిన నిధులు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ లకు బాధ్యత అప్పగించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా… గత ఏడాది కరోనా సమయంలో కూడా ముఖ్యమంత్రి ఇదే ప్రకటన చేశారు. కానీ ఒక్కరంటే ఒక్కరికీ ఇవ్వలేదని.. విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా జీవో ఇచ్చి.. అమలు చేస్తారా లేక.. చెప్పుకోవడానికేనా అన్న ప్రశ్నలు ఈ కారణంగానే వినిపిస్తున్నాయి.
మొదటి దశ కరోనా ఏపీపై విరుచుకుపడినప్పుడు… ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశ పెట్టింది. అందులో మొదటిది.. కోలుకున్న వారికి రూ. రెండు వేలు ఇవ్వడం.. రెండోది ఏపీలో ఉన్నప్రతి ఒక్క వ్యక్తికి మూడు మాస్కులు ఇవ్వడం.. మూడోది.. కోవిడ్ మరణానికి అంత్యక్రియల కోసం రూ. పదిహేను వేలు ఇవ్వడం. ఇవి కాకుండా ఇంకా చాలా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. దీర్ఖ కాలికంగా ఏడాదిలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలెన్నో సమకూరుస్తామని చెప్పారు. ఆవి నేరుగా ప్రజలకు లబ్ది చేకూర్చేవి కాదు కాబట్టి.. లైట్ తీసుకున్నా ఇబ్బంది లేదు. కానీ.. నేరుగా ప్రజలకు నగదు బదిలీ చేసే పథకాల విషయంలో మాత్రం ముందడుగు పడలేదు.
కరోనా నుంచి కోలుకున్న వారికి.. మొదట్లో రెండు, మూడు రోజులు.. రూ. రెండు వేల చొప్పున పంపిణీ చేసి ఫోటోలు దిగి మీడిలో ప్రచారం చేసుకున్నారు. తర్వాత ఆపేశారు. అప్పట్లో మృతుల సఖ్య చాలా పరిమితంగా ఉండేది.. అయినా వారికి కూడా రూ. పదిహేను వేలను అందించడంలో ప్రభుత్వం విఫలమయింది. తర్వాత కరోనా ఉద్ధృతి తగ్గింది. ఇక ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. రోజుకు దాదాపుగా వంద మరణాలు అధికారికంగా నమోదవుతున్నాయి. అంత్యక్రియల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని.. జగన్ సర్కార్ చేతులెత్తేసిందని.. వైసీపీ ఎంపీలు.. అసహనంతో మాట్లాడుకున్న మాటలు బయటకు వచ్చాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం పాత నిర్ణయాన్ని మళ్లీ.. జీవో రూపంలో విడుదల చేశారు. శరవేగంగా వారికి నగదు సాయం అందిస్తేనే ప్రజలు నమ్ముతారు. లేకపోతే.. ఇది కూడా ఓ ప్రచార గిమ్మిక్కుగా చెబుతారు.