ఏలూరులో వింత వ్యాధి బాధితులకు ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం ప్రకటించకపోవడంపై అక్కడి ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా.. ఎవరైనా ఆకస్మాత్గా బాధితులుగా మారిన వారి పట్ల ఎంతో ఔదార్యం చూపుతూ ఉంటారు. ఎల్జీ ఘటనలో మృతులకు రూ. కోటి నష్టపరిహారం ప్రకటించడమే కాదు.. మనిషికిరూ. పదివేల చొప్పున పంపిణీ చేశారు. ఏలూరులో బాధితులు అంత మంది లేరు. ఒక్కరు చనిపోయారు. ఓ ముప్ఫై మంది పరిస్థితి మాత్రం ఆందోళన కరంగా ఉంది. వారిని విజయవాడ, గుంటూరు తరలించి చికిత్స అందిసత్తున్నారు. ఐదు వందలమందికిపైగా.. చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరికి ప్రభుత్వం సాయం ప్రకటిస్తుందని… ఏలూరు ప్రజలు ఆశించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడు.. బాధితులకు సాయం ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. అయితే.. ఆస్పత్రిలో రోగులను పరామర్శించి.. ధైర్యం చెప్పి వెళ్లారు.కానీ ఎలాంటి సాయమూ ప్రకటించలేదు. సమీక్ష చేసిన తర్వాత అయినా.. చేస్తారని అనుకున్నారు. కానీ.. ప్రభుత్వానికి ఏలూరు బాధితులకు సాయం చేసే ఆలోచన లేదన్న అభిప్రాయం ఇప్పుడు ఏర్పడుతోది. ఎలాంటి నష్టపరిహారం చెల్లించే యోచన ప్రభుత్వానికి లేదన్న సంకేతాలు వస్తున్నాయి. ఓ ప్రైవేటు కంపెనీ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన వారికి.. రూ. కోటి నష్టపరిహారం ఇచ్చిన జగన్… ఏలూరు విషయంలో మరింత ఉదారంగా ఉంటారని అనుకున్నారు.
ఏలూరు వింత వ్యాధిపై బాధితులు వందల్లో ఉన్నారు. ఆ కుటుంబాలన్నీ మానసికంగా కూడా ఆందోళన చెందారు. అలాంటి వారికి ప్రభుత్వం.. తామున్నామన్న భరోసా ఇవ్వడానికైనా..ఎంతో కొంత సాయం ప్రకటించి ఉండాల్సిందన్న చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి.. ఏపీలో ఎలాంటి ఘటన జరిగినా.. పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. కానీ ఏలూరు విషయంలో మాత్రం అలాంటి సాయం చేయడానికి ఆయన ఎందుకో సిద్ధంగా లేరన్న అభిప్రాయం అక్కడిప్రజల్లో వ్యక్తమవుతోంది. కారణాలు తెలిసిన తర్వాతైనా జగన్ పరిహారం ఇస్తారని.. ఏలూరు బాధితులు ఆశగా ఉన్నారు. మరి చేస్తారో లేదో చూడాలి..!