రాష్ట్ర విభజన తరువాత ఇన్నాళ్లూ ఉభయ రాష్ట్రాలకీ ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ వ్యవహరిస్తూ వచ్చారు. దాదాపు తొమ్మిదేళ్లకుపైగా ఆయన గవర్నర్ గా ఇక్కడే ఉన్నారు. దీంతో, ఆయనకి స్థాన చలనం త్వరలోనే ఉంటుందనే కథనాలు ఈ మధ్య వచ్చాయి. ఇప్పుడు ఏపీకి ప్రత్యేకంగా ఒడిశాకు చెందిన బిశ్వభూషన్ హరిచందన్ ని కేంద్రం గవర్నర్ గా నియమించింది. దీంతో, ఇక తెలంగాణకు మాత్రమే నరసింహన్ పరిమితం కాబోతున్నారని భావించాలి. ఏపీ గవర్నర్ నియామకం సమయంలోనే నరసింహన్ కు సంబంధించిన ఏదైనా ప్రస్థావన ఉంటుందేమో అనుకున్నారుగానీ, కేంద్రం నుంచి అలాంటిదేదీ ఇంతవరకూ లేదు. ఇకపై సాంకేతికంగా ఆయన ఇక తెలంగాణకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తుంది. అయితే, అలాగని నరసింహన్ కి స్థాన చలనం ఉండే అవకాశం లేదనీ చెప్పలేం!
ఓ రెండు వారాల కిందట గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్లి, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే… ఏపీకి కొత్త గవర్నర్ ఖాయం అనే సంకేతాలు వెలువడ్డాయి. నరసింహన్ కీ స్థానచలనం తప్పదనీ, సేవల్ని వేరే చోట వినియోగించుకునే అంశం కూడా చర్చకు వచ్చినట్టు కథనాలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు సరిగా లేని సంగతి తెలిసిందే. భాజపాకి ఆ రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దే అధికారి కావాలి. నరసింహన్ ను అక్కడికి ప్రత్యేక అధికారిగా పంపించాలనే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్టుగా సమాచారం! అయితే, ఇప్పటికిప్పుడు కాదుగానీ… దానికి కొంత సమయం ఉందనీ కథనాలు వచ్చాయి. ఈలోగా నరసింహన్ బాధ్యతల్ని తగ్గించబోతున్నారనీ, దాన్లో భాగంగానే ఏపీకి కొత్త గవర్నర్ అనే వార్తలు అప్పుడే వచ్చాయి.
నరసింహన్ మార్పు కూడా త్వరలోనే ఉంటుందనే కథనాలే ఇప్పుడుమరోసారి ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే, తెలంగాణలో పార్టీ బలోపేతానికి భాజపా గట్టి ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్రానికి ఎవరైనా సీనియర్ భాజపా నేతను పంపే ఉద్దేశంలో కేంద్రం ఉందేమో చూడాలి.