తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాష్ట్ర పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఉద్యమించడానికి సిద్ధమౌతున్నారు. కారణం తెలిసిందే… పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ర్యాలీ చేసుకుంటామంటూ అనుమతులు కోరితే, కమిషనర్ అంజనీ కుమార్ పర్మిషన్ ఇవ్వలేదు. అంతేకాదు, ఇదే అంశమై ఫోన్లో ఉత్తమ్ మాట్లాడే ప్రయత్నం చేస్తే.. ఆయన దురుసుగా మాట్లాడటంతో ఉత్తమ్ ఆగ్రహించారు. సీపీ గలీజోడనీ, రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తు అనీ… చాలా ఘాటైన విమర్శలు చేశారు. అక్కడితో ఆగకుండా… రాష్ట్ర పోలీసుల తీరుపై గవర్నర్ తమిళిసైని ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి రాజధాని నగరంగా ఉన్న హైదరాబాద్ లో శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలో ఉంటాయనీ, సీపీ మీద వెంటనే చర్యలు తీసుకుని ఆయన్ని తొలగించాలన్నారు.
తమ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉంటే, అక్కడికి వస్తున్న కార్యకర్తలూ నాయకుల్ని అరెస్టు చేసే హక్కు సీపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీంతోపాటు తనతో దురుసుగా మాట్లాడిన అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని మీడియాతో ఉత్తమ్ చెప్పారు. అధికార పార్టీకి చెంచాగిరీ చేస్తూ కాంగ్రెస్ పార్టీని అణచివేసే విధంగా ఆయన పనిచేస్తున్నారని గవర్నర్ కి చెప్పామన్నారు. అంజనీ కుమార్ ఆంధ్రా కేడర్ ఆఫీసర్ అనీ, చట్ట విరుద్ధంగా ఆయన తెలంగాణలో ఉంటున్నారన్నారు. తమ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ చెప్పారు.
ఉత్తమ్ ఫిర్యాదుపై గవర్నర్ స్పందించే అవకాశం ఉందా అనేదే చర్చ. విభజన చట్టం ప్రకారం గవర్నర్ కు హైదరాబాద్ లో ప్రత్యేక అధికారులున్నమాట వాస్తవమే. కానీ, వాటిని ఇంతవరకూ వినియోగించింది లేదు. ఆ అవసరం గతంలో గవర్నర్ గా ఉన్న నర్సింహన్ కు రాలేదు, ఇప్పటి వరకూ తమిళిసై కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. ఇది కాంగ్రెస్ నేతల ఫిర్యాదు కాబట్టి, గవర్నర్ స్పందించే అవకాశాలు తక్కువే. ఒకవేళ స్పందించి, ఏదైనా చర్యలు అని గవర్నర్ అన్నారే అనుకోండి… అదేదో తమ విజయంగా కాంగ్రెస్ ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా. అయితే, ప్రస్తుతం ఈ విశేషాధికారులను వినియోగించరేమోగానీ… భాజపాకి అవసరం అనుకున్నప్పుడు, రాష్ట్రంలో పార్టీ ఎదిగే క్రమంలో ఇది ఉపయోగపడుతుందీ అనిపించినప్పుడు వీటిపై గవర్నర్ స్పందించే అవకాశం కచ్చితంగా ఉండొచ్చు.