ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదంటున్న కేసీఆర్ వైఖరిని .. బీజేపీ అనుకూలంగా మల్చుకుని ఢిల్లీ వైపు నుంచి నరుక్కొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సమస్య పరిష్కారానికి నేరుగా గవర్నర్ ను రంగంలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళిశై… బంద్ చేయాలనుకున్న క్యాబ్ డ్రైవర్లతో ఆమె స్వయంగా చర్చలు జరిపి విరమింపచేశారు. హైదరాబాద్ ఐటీకి చెడ్డపేరు రాకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నానన్నారు. అలాగే.. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా.. ఆర్టీసీ సమ్మె విషయంలో ముందు ముందు గవర్నర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే.. పాలనా వ్యవహారాల్లో రాజ్‌భవన్ ప్రాధాన్యత పెరుగుతుంది. అప్పుడు టీఆర్ఎస్కు మరిన్ని చిక్కులు తప్పవని బీజేపీ నేతలు నమ్ముతున్నారు.
కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా.. తెలంగాణ గవర్నర్ తమిళిశై… ఇప్పటికే… ఆర్టీసీ సమ్మె విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. రవాణా శాఖ కమిషనర్ ను పిలిపించి … నివేదిక తీసుకున్నారు. రవాణా మంత్రితోనూ మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అదే సమయంలో… కార్మికులతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయం… కార్మిక సంఘాల నేతలకు…అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇస్తూండటంతోనే తేలిపోతోందంటున్నారు. కార్మిక సంఘాల నేతలు…ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి ఉన్న అవకతవకలన్నింటినీ… ఆర్టీసీ ఆస్తులను టీఆర్ఎస్ నేతలు లీజుకు తీసుకోవడం వంటి వాటిపై సాక్ష్యాలు ఇచ్చి వస్తున్నారు. గవర్నర్ ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు.. ఢిల్లీకి పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే…కేంద్రం కూడా.. అసలు తెలంగాణలో ఏం జరుగుతోందని ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు..
గతంలోలా ఇప్పుడు..తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ … పండించే అవకాశాలు తక్కువని బీజేపీ నమ్ముతోంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో… ఆర్టీసీకార్మికులు బలిదానాలు చేస్తున్నా కేసీఆర్ స్పందించకపోవడంతోనే.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని.. బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే.. గవర్నర్ ద్వారా కీలక నిర్ణయాలు తీసుకున్నా.. కేంద్రం కఠిన వైఖరిని అవలంభించినా… కేసీఆర్‌కు సానుభూతి దక్కదని నమ్ముతున్నారు.