తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటాయన్న సంకేతాలు బలపడుతున్నాయి. మరోసారి మంత్రిగా కేటీఆర్ ని చూడాలనుందని తెరాస నేతలు ఈ మధ్య వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు, ఇప్పుడు ప్రగతి భవన్ వర్గాల నుంచి కూడా మంత్రి మండలి విస్తరణపై కొన్ని సంకేతాలు వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఇక్కణ్నుంచి రెండు దశల్లో విస్తరణ ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలలో కొంతమందిని కేబినెట్ లోకి తీసుకుని, ఆ తరువాత వచ్చే ఏడాది జనవరిలో మరికొంతమందికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఈ రెండు దశల్లోనూ ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొందరి బెర్తులు మార్పులు చేర్చులకు అవకాశం ఉందని కూడా సమాచారం!
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కావడం ఖాయం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే, ఆయనతోపాటు గతంలో మంత్రిగా కీలక బాధ్యత వహించిన హరీష్ రావు సంగతి ఏంటనేది ఇప్పుడు తెరాస వర్గాల్లో ఇంకోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న చర్చ ప్రకారం… సెప్టెంబర్ లో ఉండే విస్తరణలో హరీష్ కి చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయనీ, సంక్రాంతి సమయంలో జరిగే విస్తరణలో ఆయనకి ఛాన్స్ ఇస్తారనే కథనాలు వినిపిస్తున్నాయి!! కేటీఆర్ తోపాటు గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేబినెట్లో మహిళలు లేరు అనే విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి కాబట్టి సబితా ఇంద్రారెడ్డికి ఇప్పుడు అవకాశం ఉందనీ అంటున్నారు.
నిజానికి, రెండోసారి తెరాస అధికారంలోకి వచ్చాక… హరీష్ రావుకి ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారన్నది వాస్తవం. నెమ్మదిగా ఆయన సిద్ధిపేటకు పరిమితం అవుతున్నట్టుగానే కనిపిస్తున్నారు. అయితే, తన పుట్టకా చావూ తెరాసలోనే అని హరీష్ రావు గతంలో చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయనకి ఎలాంటి విభేదాలు లేవని ఎప్పటికప్పుడు తెరమీదికి వచ్చే చర్చల్ని ఖండిస్తూనే ఉన్నారు. మరి, ఇప్పుడు కేబినెట్ లో చోటు దక్కకపోతే… దానిపై ఎలా రియక్ట్ అవుతారో చూడాలి. కేబినెట్ లో హరీష్ కి చోటు దక్కాలంటే జనవరి దాకా ఆగాల్సిందే అని తెలుస్తోంది.