తెలంగాణ మంత్రి హరీష్ రావు అప్పుడప్పుడూ సుదీర్ఘ విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుంటారు! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధిని ఏవిధంగా అడ్డుకుంటున్నారు అనేది వివరించడం కోసం.. కొన్ని లెక్కల్ని చెబుతుంటారు. ఈరోజు కూడా అదే పని చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మరోసారి విమర్శించారు. ఈ మేరకు ఏకంగా పంతొమ్మిది ప్రశ్నలతో ఒక లేఖను విడుదల చేశారు.
నీటి పారుదల ప్రాజెక్టులు అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్ర చేశారనీ, పాలమూరుకు అడ్డుపడుతున్నారనీ, కాళేశ్వరంపై విషం చిమ్ముతున్నారనీ, పాలేరు ప్రాజెక్టుకు నీరు ఇవ్వకుండా అడ్డుకున్నారనీ, కల్వకుర్తి పూర్తి కాకుండా ఆయన కుట్రలు చేస్తున్న మాట వాస్తవమా కాదా అంటూ ఆ లేఖలో ప్రశ్నించారు. కృష్ణా నీళ్లు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారనీ, పోలవరం ముంపు మండలాలను కుట్ర పూరితంగా లాక్కున్నారనీ, సీలేరు ప్లాంటు దక్కనీయకుండా చేయడంతో ప్రతీయేటా రూ. 500 కోట్ల నష్టం వస్తోందనీ, ఆంధ్రా ఉద్యోగులను తమపై రుద్ది మరో రూ. 1000 కోట్ల భారం వేశారనీ, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ ప్రభుత్వ శాఖలు ఖాళీ చేసి వెళ్లిపోయినా… భవనాలకు సంబంధించిన తాళాలు వారి దగ్గరే ఉంచుకున్నారనీ…. ఇలా కొన్ని ఆరోపణలు చేశారు హరీష్ రావు.
విచిత్రమైన విషయం ఏంటంటే… తెలంగాణలో తెరాస ఎవరిపై పోరాటం అంటూ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు..? కాంగ్రెస్ మీద కదా! తెరాస చేస్తున్న అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డేస్తోందనీ, కేసులేస్తోందనీ, ప్రజా కోర్టులో తీర్పు కోసమే అసెంబ్లీని రద్దు చేశామని చెప్పారు కదా. అలాంటప్పుడు ఈ ఎన్నికల్లో తెరాస పోరాటం కాంగ్రెస్ మీద ఉండాలి. ఆ పార్టీ తీరును ప్రశ్నిస్తూ ఎన్ని లేఖలు విడుదల చేసినా కొంతైనా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపయోగపడుతుంది. అంతేగానీ, తెలంగాణలో పదో పదిహేనో సీట్లకు మాత్రమే పరిమితం అనుకుంటున్న తెలుగుదేశం పార్టీతోనే తమ పోరాటం అన్నట్టుగా మంత్రి హరీష్ రావు తీరు ఉంటోంది. టీడీపీ మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. తెరాసకు ఎలా లాభం..? కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి రగల్చాలన్న ఏకైక వ్యూహంలో భాగంగానే టీడీపీని టార్గెట్ చేస్తున్నారన్నది ప్రజలకీ తెలిసిన వాస్తవం కదా.