కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కసరత్తు కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 7న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే గవర్నర్ రాధాకృష్ణన్ తో రేవంత్ భేటీ అయినట్లు తెలుస్తోంది.
స్త్రీ, శిశు అభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం హోంశాఖ రేవంత్ దగ్గరే ఉండటంతో తనకు అత్యంత సన్నిహితురాలైన సీతక్కకు కీలకమైన ఈ శాఖను ఇవ్వాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా మహిళకే హోంశాఖను ఇచ్చినట్లుగానే.. ఇప్పుడు రేవంత్ కూడా అదే సంప్రదాయాన్ని పాటించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఒక్క సీతక్క శాఖ మినహా సీనియర్ మంత్రుల శాఖలను మార్చబోరని తాజాగా మీడియాతో చిట్ చాట్ లో మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, ఈ మంత్రివర్గ విస్తరణపై చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రేవంత్ క్యాబినెట్ లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నలుగురు ఉన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ఒకరికి అవకాశం దక్కే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, బీర్ల ఐలయ్య, ఎస్టీ కోటాలో సీనియర్ నేత బాలు నాయక్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.