అమెరికా, చైనా మధ్య పోటాపోటీ పన్నుల పెంపు, వాణిజ్య యుద్ధం ఆ రెండుదేశాలకే పరిమితం కాదు. ప్రపంచంపై ప్రభావం చూపిస్తుంది. అయితే దీర్ఘకాలంగా ఇది భారత్ కు ఎన్నో ఆవకాశాలను కల్పిస్తుందన్న విశ్లేషణలు నిపుణలు నుంచి వస్తున్నాయి. అమెరికా, చైనా పరస్పరం ప్రతీకార పన్నులు విధించుకున్నారు. ఈ కారణంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ పరికరాలు, వాహన విడిభాగాలు, మొబైల్ ఫోన్లు, ఔషధాలు, రసాయనాలు, జౌళి రంగాల్లో భారత్ లబ్ధి పొందవచ్చు. చైనాపై పన్నులు పెంచి ఇతర దేశాలపై పన్నుల పెంపును ట్రంప్ వాయిదా వేశారు. అందులో భారత్ కూడా ఉంది. అందుకే ఇప్పుడు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు పెరగనున్నాయి.
అమెరికాకు పెరగనున్న భారత ఎగుమతులు
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ మధ్య అమెరికాతో భారత్ వాణిజ్యం 82.52 బిలియన్ డాలర్లుగా ఉంది, భారత్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. అమెరికా వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సిఉంది. వారికి భారత ఉత్పత్తులు ఆకర్షణీయంగా మారతాయి. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రపంచానికి ఆపిల్ సంస్థ అందించే ప్రతి ఐదు ఫోన్లలో ఒకటి ఇండియాలో తయారవుతోంది. రాబోయే రోజుల్లో మరింతగా పెరగనుంది. భారత తయారీ రంగం సామర్థ్యం పెంచుకున్నదాన్ని బట్టి మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంది.
చైనా నుంచి భారత్ వైపు రానున్న మల్టీ నేషనల్ కంపెనీల మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్
చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు విదేశీ కంపెనీలు భారత్‌లో తమ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’కు కొత్త ఉత్సాహం ఇస్తుంది. అయితే ఇది అంత తేలిక కాదు. ఎందుకంటే భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, ఖర్చు సామర్థ్యం చైనాతో పోలిస్తే ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. ఈ అంశాలు భారత్‌ను పూర్తిగా చైనాకు ప్రత్యామ్నాయంగా నిలబడలేవు. కానీ మౌలిక సదుపాయాలు పెంచుకుంటే మాత్రం పోటీగా మారేందుకు ఆకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా పెద్ద పెద్ద కంపెనీలో భారత్ లో యూనిట్ల ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నాయి.
ముడిపదార్థల కొరత కూడా సమస్యే
భారత దేశం తయారీ రంగంలో చైనాకు పోటీ ఇవ్వాలంటే స్వయం సమృద్ధి సాధించాలి. కానీ భారత్ ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఔషధ కాంపోనెంట్లలో చైనా నుంచి దిగుమతులపై ఆధారపడుతుంది. చైనా ఉత్పత్తులపై సుంకాలు పెరిగితే, ఈ దిగుమతుల ధరలు పెరిగి భారత పరిశ్రమలపై ప్రభావం చూపవచ్చు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం గ్లోబల్ మార్కెట్లలో అస్థిరతను సృష్టిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ఈ సవాల్ ను భారత తయారీ రంగం ఎదుర్కోవాల్సిన ఉంటుంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం భారత్‌కు ఎగుమతి మరియు పెట్టుబడి అవకాశాలను పెంచే అవకాశం ఉన్నప్పటికీ, చైనాపై దిగుమతి ఆధారపడటం, ప్రపంచ ఆర్థిక అస్థిరత వంటి సవాళ్లను భారత్ అధిగమించాల్సి ఉంటుంది.