అమెరికాకు ఒకే రోజు మూడు కార్గో విమానాలు మేడిన్ ఇండియా ఐ ఫోన్లతో వెళ్లాయన్న వార్త ఎక్కువ మందిని ఆకర్షించింది. ట్రంప్ పన్నులు పెంచేలోపే అక్కడికి చేరుకునేలా ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇండియాకు కాస్త రిలీఫ్ ఇచ్చారు. కానీ చైనాకు ఇవ్వలేదు. ఐ ఫోన్లలో అత్యధికంగా చైనాలోనే తయారవుతాయి. అంటే.. ఇప్పుడు ఇండియాలో ఉత్పత్తి పెంచుకోవడానికి కావాల్సినంత అవకాశం ఉందన్నమాట. ఒక్క ఐ ఫోన్ల విషయంలోనే కాదు.. చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రతీ వస్తువు విషయంలోనూ భారత్ అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
భారత తయారీ రంగానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్ప అవకాశం ఇస్తున్నారు. చైనాను కొట్టేసి ఆ స్థానాన్ని అందుకోలేకపోయినా కొంత వరకూ అయినా చైనా అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఇండియాకు అవకాశం లభిస్తోంది. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. ఒకరికొకరు.. పన్నుల శాతాలు పెంచుకుంటూ పోతున్నారు. రేపటి రోజున ఒకరి వస్తువుల్ని మరొకరు బ్యాన్ చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీని వల్ల చైనా వస్తువులకు డిమాండ్ పడిపోతుంది. అదే అవకాశాన్ని భారత్ వినియోగించుకుంటే.. తయారీ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
కరోనా తర్వాత ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ ఉత్పత్తుల విభాగాలను చైనాలో పరిమితం చేయడమో.. తగ్గించడమో చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. అయితే అనుకున్నంతగా భారత్ ఆ అవకాశాలను అందిపుచ్చుకోలేదన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఇప్పుడు ట్రంప్ సుంకాల రాజకీయంతో.. భారత్ కు అనుకోని అవకాశాలు కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వ పెద్దల చొరవ.. ఇప్పుడు అత్యంత కీలకం. తయారీ రంగంలో భారత్ చాంపియన్ అవ్వాలంటే.. చైనాకు కనీసం పోటీ అవ్వాలంటే.. ఇప్పుడు చేసే ప్రయత్నాలే కీలకం.