చిత్రసీమకు పెద్ద ఎవరు? అన్న ఎవరు? అనే ప్రశ్న ఎప్పుడొచ్చినా చిరంజీవి పేరు గట్టిగా వినిపిస్తుంది. ‘నేను పరిశ్రమకు పెద్దగా కాదు, బిడ్డగానే ఉంటా’ అని వినమ్రంగా చిత్రసీమపై తన ప్రేమని వ్యక్తం చేసేవాడు చిరు. కానీ.. వాస్తవ పరిస్థితి వేరు. సినిమా వాళ్లకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా.. పెద్దన్న పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, ఆ సమస్యని తన భుజాలపై వేసుకొని, పరిష్కారం కోసం అన్వేషించాడు చిరు. టికెట్ రేట్ల పెంపు వ్యవహారంలో తనకు అవమానం జరిగినా.. జగన్ సర్కారుకి దండం పెట్టి – పరిశ్రమ కోసం తగ్గాడు. తన పలుకుబడితో తెలంగాణ ప్రభుత్వంతోనూ పరిశ్రమకు కావాల్సిన పనులు చక్కబెట్టాడు. చిరు తలచుకొంటే.. ఇప్పుడు కానిదేం లేదు. అయితే ఇవేం తన కోసం కాదు. తన వారసుల కోసం కాదు. పరిశ్రమ కోసమే. ఈ విషయం అందరికీ తెలుసు.
ఇప్పుడు వాల్తేరు వీరయ్య 200 రోజుల పండుగలోనూ.. చిరు మాట్లాడింది పవన్ వెనుక నిలబడడం కోసమో, పవన్ కోసమో కాదు. అది కూడా పరిశ్రమ కోసమే. జనం కోసమే. చిత్రసీమ వేలాదిమందికి అన్నం పెడుతోందని, అలాంటి పరిశ్రమలోకి రాజకీయాలు తేవొద్దని చాలా వినమ్రంగా వేడుకొన్నాడు చిరు. ప్రజల సంక్షేమం కోసం దృష్టి పెట్టండని చాలా సున్నితంగా చెప్పాడు చిరు. ఆయన భాష, భావ వ్యక్తీకరణ చాలా సహజంగా, అందంగా ఉన్నాయన్నది ఆ వీడియో చూసిన వాళ్లెవరికైనా అర్థమవుతాయి.
కానీ ఏపీ మంత్రులు చేస్తోందేమిటి? వాళ్లు వాడుతున్న భాష ఏమిటి? చిరు మాటలకు మంత్రులంతా భుజాలు తడుముకొంటున్నారు. చిరుకి మేం అభిమానులమే అని చెబుతూనే, చిరుపై పరోక్షంగా యుద్దానికి దిగుతున్నారు. చిత్రసీమ శ్రేయస్సు గురించి, ఓ సినిమా వాడిగా చిరు మాట్లాడకూడదా? చిరు ఏం మాట్లాడినా పవన్ కోసమే అంటారా? జగన్ ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు అయ్యింది. ఈ నాలుగేళ్లలో చిత్రసీమకు జగన్ సర్కారు చేసిన మేలు ఏమిటో వాళ్లకైనా తెలుసా? ఇన్నాళ్లూ జగన్ సర్కారు పని తీరుపై చిరు నోరు విప్పలేదు. అందుకే చిరు వాళ్లకు మంచోడిగా కనిపించాడు. ఇప్పుడు మాత్రం ఏపీ మంత్రుల దృష్టిలో చిరు కూడా విలన్ అయిపోయాడు.
ఇప్పుడు సమస్య అంతా… ఏపీ మంత్రుల వైఖరి గురించి కాదు. ఎందుకంటే వాళ్లు ఇంత కంటే గొప్పగా స్పందిస్తారని అనుకోవడం అత్యాస. చిత్రసీమ ఈ విషయంలో ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తుందనేదే ముఖ్యం. ఎందుకంటే చిరు మాట్లాడింది తన స్వలాభం కోసం కాదు. పరిశ్రమ కోసం. అందరి తరపున మాట్లాడిన మాట. చిరుకి ఆ హక్కు, అనుభవం ఉన్నాయి కూడా. ఆ పాపానికి.. చిరుని టార్గెట్ చేసింది వైకాపా ప్రభుత్వం. మొన్న బ్రో రివ్యూలు ఇచ్చినట్టు రేపు భోళా శంకర్ సినిమాకీ ఇలానే నెగిటీవ్ రివ్యూలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అసవరం లేదు. అలా జరిగితే.. అప్పుడు పరిశ్రమ నుంచి సరైన సమాధానం ఇవ్వగలగాలి. ‘మా వెంట చిరు ఉన్నప్పుడు చిరు వెంట మేం ఉంటాం’ అని భరోసాని చిత్రసీమ ఇవ్వగలగాలి. అలా జరగాలంటే జరుగుతున్న వ్యవహారాలపై కనీసం ఇద్దరు ముగ్గురు పెద్దలైనా స్పందించాలి. మరి అలా జరుగుతుందా.? చిరుకి అలాంటి మద్దతు లభిస్తుందా..?