నిండా మునిగిపోయి ఎటుపోవాలో తెలియక నా మతం మానవత్వం అని సినిమా డైలాగులు కొట్టారు జగన్ రెడ్డి. అసలు మానవత్వం అనే పదానికి స్పెల్లింగ్ తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగనేనని ఐదేళ్ల పాటు చేసిన పాలనే సాక్ష్యం. చివరికి సొంత కుటుంబసభ్యులనూ వదల్లేదు. సొంత బాబాయ్ ను హత్య చేస్తే న్యాయం చేయాల్సిన పొజిషన్లో ఉండి ఆయన హంతకుల్ని వెనకేసుకు రావడం.. ఆ బాబాయ్ కుమార్తె, తన చెల్లినే హత్య చేయించారని తప్పుడు ప్రచారాలు చేయించడం జగన్కు తెలిసిన మానవత్వం. సొంత చెల్లికి ఆస్తులు పంచివ్వాల్సి వస్తుందని ఆమెను కూడా దూరం పెట్టి.. ఆమెపైనా తప్పుడు ప్రచారాలు చేయడం జగన్ మానవత్వం. సొంత తల్లిపై సోషల్ మీడియాలో ఘోరంగా మాట్లాడించడం ఆయనకు తెలిసిన మానవత్వం.
కుటుంబసభ్యులతోనే ఇలా ఉంటే.. ఇక ఇతరులపై ఎలాంటి మానవత్వం చూపుతారో చెప్పాల్సిన పని లేదు. తన మానసిక ఆనందం కోసం.. ఇతరుల్ని హింసించేలా అందర్నీ ప్రోత్సహించడం జగన్ మానవత్వ మతంలోని మొదటి లక్షణం. వేరే వాళ్లు ఏడుస్తూంటే.. తాను వికటాట్టహాసం చేయడం జగన్ రెడ్డి మానత్వంలోని అసలు కోణం. ఐదేళ్ల కాలంలో తప్పుడు కేసులు పెట్టి… చట్టాలను ఉల్లంఘించి ఆయన ఎంత మందిని హింసించారు.. ఎంత మందిని చంపించారో లెక్కే లేదు. కడప జిల్లాలో ఓ నందం సుబ్బయ్య అనే వ్యక్తి అప్పటి వరకూ వైసీపీలోనే పని చేసినా… ఎమ్మెల్యేకు వ్యతిరేకమయ్యారని.. పట్టపగలు పిలిచి అందరి ముందు చంపేశారు. ఇలాంటివి బయటకు రానివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఏ మానవత్వ మతం పాటించే వ్యక్తి కనుసన్నల్లో జరిగాయి ?
సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని అరెస్టు చేసిన వాళ్లను.. వాళ్లకుటుంబసభ్యుల్ని ప్రతిపక్ష నేతల్ని.. వారి కుటుంబసభ్యుల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టించడం జగన్ మానవత్వం. అక్రమ సంబంధాలు అంటగట్టి.. పుట్టుకల్ని ప్రశ్నించడం ఆయన మానవత్వ మతం. జగన్ రెడ్డి చాలా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆయన భాష, వ్యవహారశైలి.. చూసిన వారు ఎవరైనా అర్థం చేసుకుంటారు. కుటుంబసభ్యులకు అర్థమవుతుందో లేదో మరి !