మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్‌పై దక్షిణాదిలో అసంతృప్తి ఉంది. అయితే తమిళనాడులోనే ఈ సమస్యను ప్రజలు ఎక్కువగా తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పట్టించుకోవడం లేదు. మెడికల్ ఎగ్జామ్ కోసం పోటీ పడేవాళ్లు తక్కువగా ఉండటమే దీనికి కారణం. కానీ తమిళనాడులో పరిస్థితి అలా లేదు. అది రాజకీయ అంశమైపోయింది. దీంతో నీట్‌ను రద్దు చేయాలని తమిళనాడు డిమాండ్ చేస్తోంది. పార్లమెంట్లో ఆందోళనలు చేస్తున్నారు. నీట్ రద్దు కోసం సమైక్యంగా పోరాడదామని స్టాలిన్ పలు మార్లు తన మిత్రులైన కేసీఆర్, జగన్‌లకు సందేశం పంపించారు.
కానీ వారు మాత్రం స్పందించడం లేదు. అయితే స్ఠాలిన్ మాత్రం తన పోరాటం ఆపడం లేదు. ఇటీవల ఏపీకి చెందిన ఓ విద్యార్థి ప్రత్యేకంగా స్టాలిన్‌కు నీట్ రద్దుపై చేసిన విజ్ఞప్తి హైలెట్ అయింది. తెలుగు రాష్ట్రాలు కలిసి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తమ రాష్ట్ర విద్యార్థుల కోసం ఆయన ప్రత్యేక చట్టం తేవాలని ప్రయత్నిస్తోంది. తమిళనాడు విద్యార్థులను నీట్ నుంచి మినహాయించాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్‌లో బిల్లును ఆమోదించారు. 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెడికల్ కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని తమిళనాడు సర్కారు ఆ బిల్లులో ప్రతిపాదించింది.
ఈ బిల్లు చాలా కాలం తన దగ్గరే పెట్టుకున్న గవర్నర్ చివరికి వెనక్కి పంపారు. దీంతో మరోసారి నీట్ నుంచి విద్యార్థులను మినహాయించే బిల్లును ఆమోదించడం కోసం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎక్కువ రాష్ట్రాలు కలిస్తే దీనిపై బలంగా పోరాడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒక్క తమిళనాడు సమస్యగానే మారింది.