రుషికొండ అక్రమ కట్టడం అని ఇప్పటికే తేలిపోయింది . అనుమతులు లేకుండా.. తీసుకున్న అనుమతులను మించి కట్టినట్లుగా కోర్టు కూడా నిర్దారించింది. అంతకు మించి అక్కడ పర్యాటక భవనాలు , హోటల్ నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. నిబంధనల ప్రకారం… రుషికొండపై పర్యాటక రంగానికి చెందిన వాటికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే అక్కడే సీఎం క్యాంప్ ఆపీస్ అని అందరికీ తెలుసు. కనీసం ఇరవై కోట్లు పెట్టి ఇంటీరియర్ చేయించుకుంటున్నారు.
కానీ ధైర్యంగా ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పుకోలేనంత తప్పుడు కట్టడాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే దసరాకు సీఎం జగన్ అక్కడ గృహ ప్రవేశం చేయాలనుకుంటున్నారు. కనీసం అప్పుడైనా సీఎం క్యాంప్ ఆఫీస్ గా ప్రకటిస్తారా అంటే… అంత సీన్ లేదనే వాదన వినిపిస్తోంది.. ఆ కట్టడంపై ఇప్పటికీ కోర్టు కేసులు ఉన్నాయి… పర్యాటక తప్ప. పాలనా వ్యవహారాల భవనాలకు అక్కడ అనుమతి ఉండదు. ఎలా చూసినా జగన్ రెడ్డి అక్రమ కట్టడంలోకే గృహప్రవేశం చేయబోతున్నారు.
అన్ని అనుమతులు ఉండి… నిబంధనల ప్రకారం సరైన కట్టడం అయిన ప్రజా వేదికను జగన్ రెడ్డి.. అక్రమ కట్టడంగా ప్రకటించి కూల్చివేయించారు. దీనికి కారణం చంద్రబాబు ఇంటి పక్కన ఉండటం మాత్రమే కాదు.. ఆయన అక్కడ్నుంచే సమీక్షలు చేసే వారు. దాన్ని జీర్ణించుకోలేక అక్రమ కట్టడం పేరుతో కూల్చేసి .. పదిహేను కోట్ల వరకూ నష్టం చేశారు. అక్రమ కట్టడాలు ఉండకూడదన్నది తన ఉద్దేశమని చెప్పారు. ఇప్పుడు పనిగట్టుకుని అక్రమ కట్టడం కట్టించి మరీ ఎన్నికలకు ముందు గృహప్రవేశం చేస్తున్నారు. ఇంత కన్నా నైతికంగా పతనం అయ్యే సీఎం మరొకరు ఉండరేమో ?