విజయసాయిరెడ్డి వ్యవహారశైలి వైసీపీలో సంచలనంగా మారుతోంది. తారకరత్న మరణంపై వైఎస్ఆర్సీపీ ఓ ప్రత్యేకమైన స్ట్రాటజీని పెట్టుకుంది. అందులో భాగంగా లక్ష్మి పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శలను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఆ స్ట్రాటజీని ఫాలో కాలేదు. ఆయన మామూలుగానే స్పందించారు. దీంతో లక్ష్మిపార్వతితో పాటు ఇతర నేతలు చేసిన విమర్శలకు టీడీపీ నేతలు… విజయసాయిరెడ్డి మాటలను కౌంటర్ గా ఇచ్చారు. ఇది వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరంగా మారింది.
అయితే విజయసాయిరెడ్డి మాత్రం తారకరత్న తన చెల్లెలి అల్లుడు కాబట్టి కుటుంబసభ్యునిగా దగ్గరుండి అన్ని చూసుకున్నారు కానీ.. రాజకీయంగా పట్టించుకోలేదని ఆయన వర్గీయులు అంటున్నారు. అయితే గతంలో విజయసాయిరెడ్డి రాజకీయం చూస్తే.. ఇలాంటి సెంటిమెంట్లు ఆయన పట్టించుకోలేదన్న సంగతిని ఇతరులు గుర్తు చేస్తున్నరు. విజయసాయిరెడ్డి. పార్టీలో ఒకప్పుడు నెంబర్ టు ఆయన. కానీ ఇప్పుడు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. గతంలో తన ట్విట్టర్ అకౌంట్‌ను అగ్రెసివ్ గా ఉంచేవారు. తీవ్ర విమర్శలు చేసేవారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. ట్విట్టర్లో అసలు ప్రతిపక్షంపై విమర్శలు చేయడం మానేశారు.
తారకరత్న అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ రెండు రోజుల పాటు విజయసాయిరెడ్డి భౌతిక కాయం వద్దనే ఉన్నారు. ఎవరు వచ్చినా మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినా మాట్లాడారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా వెళ్లడం.. కారు వద్దకు వెళ్లి సాగనంపడం.. పక్కన కూర్చుని చాలా సేపు ముచ్చటించడం సంచలనంగా మారింది. నిజానికి అలాంటి సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడుకునే అవకాశం లేదు. కానీ తన ముచ్చట్లు వైసీపీ పెద్దలకు కోపం తెప్పిస్తుందని విజయసాయిరెడ్డికి తెలుసు. చావులను కూడా రాజకీయం చేసే తమ పార్టీ పెద్దల గురించి ఆయనకు తెలియనిదేం కాదు. కానీ ఆయన ఓ సందేశం పంపడానికే ఇలా చేశారన్న వాదన వినిపిస్తోంది.
ఒకప్పుడు వైసీపీలో నెంబర్ టు స్థానంలో ఉన్నారు విజయసాయిరెడ్డి. గత ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక ఆయన మల్టీ టాస్కింగ్ ఉంది. కానీ తర్వాత ఆ స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి పొందారు. చాలా ఏళ్ల పాటు సోషల్ మీడియాను విజయసాయిరెడ్డి చూసుకున్నా.. అది కూడా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడి చేతికి వెళ్లింది. ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో కనపించడం కూడా తగ్గిపోయింది. సీఎం జగన్ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఆయన ఉన్నారు కానీ..సీఎం జగన్ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు.