అవును.. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే జగన్ రెడ్డి పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. మొదటి రోజే ఆయన అసెంబ్లీకి వస్తారా..? అనే అనుమానాలకు తెరదించుతూ సభకు హాజరైన జగన్.. ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. సభ్యులందరి ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు ఉండకుండానే బయటకు వెళ్ళిన జగన్ శనివారం అసెంబ్లీకి వెళ్ళడం సందేహమేనని తెలుస్తోంది.
శనివారం అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంచనమే కానుంది. అయితే, రెండో రోజు అసెంబ్లీకి జగన్ డుమ్మా కొడుతారనేందుకు ఇదే కారణంగా తెలుస్తోంది. గురువారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అయ్యన్నపాత్రుడు ఇటీవల తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాంటి వ్యక్తిని స్పీకర్ చేయడం విచారకరమన్న జగన్… అయ్యన్నపాత్రుడిని స్పీకర్ గా అంగీకరించే పరిస్థితిలో లేరని చెప్పకనే చెప్పారు. దీంతో స్పీకర్ ఎన్నిక సందర్భంగా అసెంబ్లీకి జగన్ దూరంగా ఉండే అవకాశాలు లేకపోలేదు.
ఇక, మొదటి రోజు అసెంబ్లీకి వెళ్ళకపోతే తర్వాత అయ్యన్నపాత్రుడు సమక్షంలో ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుందని, దానికంటే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణస్వీకారం చేయడం మంచిదనే ఆలోచనతో నేడు జగన్ సభకు హాజరయ్యారని అంటున్నారు. అలాంటిది స్పీకర్ గా అయ్యన్న ఎన్నికకు మద్దతు తెలపడటానికి జగన్ మనస్సు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. సో, రేపు జగన్ అసెంబ్లీకి వెళ్ళనట్లే. అయితే, భవిష్యత్ లోనూ జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవచ్చుననే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మనం చేసేదేమీ లేదన్న జగన్…ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనే భావిస్తున్నారు.
పైగా.. గతంలో అసెంబ్లీలో జగన్ కు రక్షణ కవచంగా నిలిచిన వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్లు ఎవరూ ఈ ఎన్నికల్లో గెలవలేదు. దీంతో ఈసారి అధికార పక్షం నుంచి వచ్చే కౌంటర్లను, సెటైర్లను ఎదుర్కోవడం జగన్ కు అంతా తేలిక కాదని.. అందుకే ఆయన ఈ ఐదేళ్ళు అసెంబ్లీకి దూరంగా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..