తెలుగు రాష్ట్రాల్లో బలపడాలి అన్న బిజెపి కోరిక ఎప్పటినుండో నెరవేరకుండా అలాగే పెండింగ్లో ఉంది. సరైన నాయకుడు లేకపోవడం, బిజెపి నినాదం అయిన హిందుత్వ వాదానికి తెలుగు రాష్ట్రాలలో పెద్దగా మద్దతు లేకపోవడం, ఇక విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలకి బిజెపి వల్ల ఒరిగింది పెద్దగా ఏమీ లేకపోవడం వంటి కారణాల వల్ల బిజెపి తెలుగు రాష్ట్రాలలో బలపడలేక పోయింది. రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో బలపడడానికి బిజెపి చాలా ప్రయత్నాలు చేయనుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో, జగన్ నిర్ణయం బిజెపి వ్యూహాలకు ప్రతిబంధకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ నాయకుల ని బిజెపి టార్గెట్ చేస్తుందా?
త్వరలోనే తెలుగుదేశం పార్టీ నుండి ఆంధ్రప్రదేశ్ లోని చాలామంది లీడర్లను బిజెపి తనవైపుకు తిప్పుకోబోతుంది అన్న రూమర్లు ఎప్పటి నుండో వస్తునే ఉన్నాయి. పత్తిపాటి పుల్లారావు, జెసి దివాకరరెడ్డి, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు లాంటి ఎంతోమంది నాయకులని కేంద్రంగా చేసుకొని పలు రూమర్లు వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి. అయితే తమ మీద వస్తున్న వార్తల గురించి స్పందిస్తూ, జెసి దివాకర్ రెడ్డి లాంటి నాయకులు, అవన్నీ వట్టి పుకార్లేనని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు తాజాగా గంటా శ్రీనివాసరావు వంటి లీడర్లు బిజెపి లోకి చేరే అవకాశాలు ఉన్నాయంటూ రూమర్లు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో కొంతమందిని అయినా లాగాలని, ఇక వివిధ పార్టీల తరపున పోటీ చేసి గెలవలేకపోయిన అనేకమంది లీడర్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు కాబట్టి వాళ్లలో వీలైనంత మందిని లాగాలని బిజెపి ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జనసేన తరపున పోటీ చేసిన రావెల కిషోర్ బాబు లాంటి ఒకరిద్దరు బిజెపిలోకి చేరిపోయారు. ఇక మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బిజెపి లోకి వెళ్ళడానికి సుముఖంగా ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలు ఒక ఏడాది సమయం ఆగమని ఆయనకు సూచించినట్లు రూమర్లు వచ్చాయి. ఇదే తరహా రూమర్లు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని నాని మీద కూడా వస్తున్నాయి. ఆయన సోషల్ మీడియాలో సొంత పార్టీ పై చేస్తున్న వ్యాఖ్యలు అందుకు కారణం. ఆయన తాను బీజేపీలో చేరడం లేదు అని చెప్పినప్పటికీ ఆ రూమర్లు ఆగడం లేదు.
ఫిరాయింపు ల విషయం లో జగన్ నిర్ణయం బిజెపికి ప్రతికూలంగా మారనుందా?
అయితే జగన్ ఆ మధ్య ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించమని, ఒకవేళ ఎవరైనా రావాలనుకున్నా కూడా వారిని పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రావాలని కోరతామని అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఫిరాయింపుల విషయంలో లో నిక్కచ్చి గా ఉంటాను అని వ్యాఖ్యానించి ఉన్నారు. దీంతో ఒకవేళ ఏ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేయకుండా బిజెపిలోకి ఫిరాయిస్తే, స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో – అదే కనుక జరిగితే వారు తిరిగి కమలం గుర్తు మీద ఆంధ్రప్రదేశ్ లో గెలవడం అనేది దాదాపు అసాధ్యం గా కనిపిస్తోంది. ఈ లెక్కన జగన్ నిర్ణయం బిజెపికి ప్రతికూలంగా మారనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే మరొక వాదన ఏమిటంటే, బిజెపి పెద్దలు నిజంగా తలచుకుంటే గనక జగన్ ని కంట్రోల్ చేయడం వారికి పెద్ద విషయం కాదని, జగన్ మీద ఉన్న కేసుల దృష్ట్యా బీజేపీ పెద్దలకు ప్రతికూలంగా మారే పరిస్థితి జగన్ సృష్టించే అవకాశమే లేదని ఇంకొందరు అంటున్నారు.
ఏదిఏమైనా కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడల్లా, ఒక ఆరు నెలల పాటు, వారు రాష్ట్రంలో కూడా బలపడతారు అనే ఊహాగానాలు రావడం, ఆ తర్వాత వారు యథావిధిగా హిందీ రాష్ట్రాల రాజకీయాల్లో తలమునకలు అయిపోయి తెలుగు రాష్ట్రాలను లైట్ తీసుకోవడం ఎప్పటినుండో జరుగుతూ ఉంది. అసలు 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి ఆరు నెలలు కూడా బిజెపి బలపడడం గురించి పలు రకాల రూమర్లు ఇదేవిధంగా వచ్చాయి. కానీ 2019 వచ్చేసరికి ఒక ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ కూడా బిజెపి తరఫున పోటీ చేసి ఆంధ్రప్రదేశ్లో గెలవలేని పరిస్థితి ఏర్పడింది.
మరి తెలుగు రాష్ట్రాలలో రాబోయే ఐదేళ్లలో నిజంగానే బిజెపి బలపడుతుందా అసలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందా అన్నది వేచి చూడాలి.