జగన్ మెడకు మరో ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తోంది. పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్ లో అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో వైసీపీకి టెన్షన్ పట్టుకుంది. ఈ దర్యాప్తు వ్యవహారం అటు, ఇటు వెళ్లి జగన్ ను ఇరకాటంలోకి నెడుతుందా..? అనే వైసీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్ లో అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా లబ్దిదారులను ఎంపిక చేశారని పేర్కొన్నారు. అయితే, ఇళ్ళ నిర్మాణం పూర్తి కాకుండానే హౌజింగ్ కార్పోరేషన్ నుంచి వైసీపీ నేతలు బిల్లులు కూడా తీసుకోవడం గమనార్హం.
జగనన్న ఇళ్ళ పేరిట పేదలకు ఇల్లు ఇస్తామని వైసీపీ నానా హడావిడి చేసింది. ఇందుకోసం మూడు ఆప్షన్లు ఇచ్చిన నాటి ప్రభుత్వం అందులో మూడో ఆప్షన్ కింద తామే ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని ప్రకటించింది. ఈ ఇళ్ళ నిర్మాణం బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి అప్పగించింది. జగనన్న లేఅవుట్ లో మొత్తం 8,400ఇళ్ళకు లబ్దిదారులను ఎంపిక చేసి, 6990 ఇళ్ళకు పనులు అప్పగించగా.. నిర్మించిన ఇళ్లు కేవలం 99 మాత్రమే. కానీ ఏకంగా 84కోట్ల బిల్లులను బుక్కేశారు.
వీటిపై ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో చంద్రబాబు విచారణకు ఆదేశించారు. పనులు పూర్తి కాకుండా బిల్లులు చెల్లించిన వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. అయితే, పులివెందులలో ఇలాంటి అక్రమాలు చోటు చేసుకున్నా జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..? ఈ విషయం ఆయనకు తెలియకుండానే జరిగిందా..? లేదంటే తెలిసి కూడా చూసి చూడనట్టు వదిలేశారా..? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఈ విషయంలో జగన్ కు చిక్కులు తప్పవని రాజకీయవర్గాలు చర్చ జరుగుతోంది.