వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి సమయం ముంచుకొస్తోంది. తన ప్రమాణస్వీకార ఏర్పాట్లపై.. తనే సమీక్ష చేసుకుంటున్నారు. అయితే.. ఇది కేవలం.., షామియానాలు, పార్కింగ్లు, ట్రాఫిక్ క్రమబద్దీకరణల గురించి కాదు.. ప్రమాణస్వీకారం తర్వాత తాను… ప్రజలకు ఇస్తానన్న నవరత్నాల్లో … ఒకటో, రెండో రత్నాలను ప్రమాణస్వీకారానికి గుర్తుగా ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నారు.
వృద్ధులకు రూ. 3వేలు తొలి రత్నంగా అందిస్తారా..?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో పాటు… వాటికి అనుబంధంగా.. చాలా హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నింటినీ అయినా.. మొదటి సారిగా అమలు చేయడానికి కొంత కసరత్తు జరుగుతోంది. మూడు రోజులుగా.. ఆర్థిక శాఖ అధికారులు విపరీతమైన కసరత్తు చేసి కొన్ని ప్రతిపాదనలను జగన్మోహన్ రెడ్డి వద్దకు చేర్చారు. వాటికి ఆయన ఆమోదం లభించాల్సి ఉందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి మహిళలు ఓటు వేశారని అందరూ అనుకున్నారు కానీ… ఆ ఓట్లన్నీ… వైసీపీకే పడ్డాయి. వృద్ధులకు పెన్షన్ మూడు వేలు చేస్తామని చెప్పడంతో వారూ వేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని జగన్ చెప్పడంతో.. పసుపు – కుంకుమ పేరుతో రూ. పదివేలు ఇచ్చినప్పటికీ… జగన్‌కే ఓట్లేశారు. ఈ రెండు హామీలను మొదటి విడతగా నెరవేరిస్తే.. ప్రజల్లో కొంత సంతృప్తి ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.
ప్రమాణస్వీకార వేదికపై హామీల అమలు ప్రకటిస్తారా..?
వైసీపీ మేనిఫెస్టోలో.. కులాల వారీగా… హామీలున్నాయి. టైలర్ షాపులకు, ఆటో డ్రైవర్లకు, బార్బర్ షాపుల వాళ్లకి కూడా.. ఏడాదికి రూ. పదివేలు ఇస్తామని చెప్పారు. ఇలాంటివన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లాయి. అలాగే రెండున్నర లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ సహా.. అనేక హామీలు యువతను ఆకట్టుకున్నాయి. ఇవన్నీ మాస్ హామీలు. ఏ ఒక్కటి నెరవేర్చేదానికి మొదటి సంతకం పెట్టినా.. జగన్మోహన్ రెడ్డికి గుడ్ స్టార్ట్ అవుతుంది. ఇక అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లింపు, తీత్లీ బాధితులకు రూ. 3500 కోట్ల పరిహారం చెల్లింపు వంటి హామీలు జగన్ ఇచ్చారు. తీత్లీ తుపాను సమయంలో.. జగన్ కనీసం చూడటానికి వెళ్లకపోయినా.. అక్కడి ప్రజలు ఓట్లేశారు. నష్టపోయిన మొత్తం తిరిగి ఇస్తానన్న హామీ కారణంగానే.. ఓట్లు పడినట్లు భావిస్తున్నారు. వీటిని.. జగన్మోహన్ రెడ్డి అమలు చేయాల్సి ఉంది.
ఆర్థిక పరిస్థితి బాగోలేదనే సాకులు చెబితే కష్టమే..!
మొదటి సంతకం దేనిపై పెడతారన్నదానిపై.. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే…ఏపీ ఆర్థిక పరిస్థితి అంత బాగోలేదన్న కారణం చూపి… హామీలన్నీ.. తర్వాత నెరవేరుస్తానని.. చెబితే మాత్రం… కాస్త ప్రతికూలత వచ్చే ప్రమాదం ఉంది. కనీసం.. నవపత్నాలతో పాటు. ప్రజలకు పాదయాత్రలో ఇచ్చిన కొన్ని హామీలనైనా… ముందుగా అమలు చేస్తేనే… నమ్మకం చిక్కుతుంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న కారణంగా… ప్రకటించిన పథకాల అమలును వాయిదా వేస్తే… వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే.. రాష్ట్ర విడిపోయినప్పుడు… ఏపీకి వేల కోట్ల లోటు బడ్జెటే వచ్చింది.అయినా చంద్రబాబు.. సంక్షేమానికి ఎక్కడా లోటు రానీయలేదు. ఇప్పుడు.. కొంత తేడా వచ్చినా.. పోలికలు తెస్తారు.