ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇక వరుసగా రెడ్ బుక్ వేట సాగించాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది. ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టిన వారందరినీ జైలుకు పంపుతున్నారు. ఇక శ్రీరెడ్డి వంతు అనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆమె కాళ్ల బేరానికి వచ్చారు. వైసీపీ సోషల్ మీడియా టీం చెప్పమన్నట్లుగా చెప్పాను కానీ తన తప్పేం లేదన్నారు. అయితే ఇటీవల మళ్లీ బూతులు మాట్లాడటం ప్రారంభించారరు. దాంతో ఆమెను కూడా అరెస్టు చేయక తప్పదన్న భావన వినిపిస్తోంది.
అరెస్టు ఖాయమని తేలడంతో ఆమె ఇటీవల తనపై నమోదైన కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. కొన్ని కేసుల్లో అరెస్టు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమెను అరెస్టు చేయాలంటే ఏపీ పోలీసులకు పెద్ద విషయం కాదు. కాని మహిళల్ని అరెస్టు చేయకూడదన్న పాలసీని ఏపీ ప్రభుత్వం పెట్టుకుందని చెబుతున్న సమయంలో ఆమె అరెస్టు ఉండకపోవచ్చని అంటున్నారు.
ఒక వేళ శ్రీరెడ్డిని అరెస్టు చేసినా జగన్ సపోర్టు చేస్తారా అన్న ప్రశ్న వైసీపీ వర్గాలతో పాటు ఇతర పార్టీల్లోనూ వస్తోంది. ఎందుకంటే శ్రీరెడ్డికి తమ పార్టీకి సంబంధం లేదని గతంలో కొంత మంది ప్రకటించారు. శ్రీరెడ్డికి సపోర్టు చేస్తే జగన్ పరిస్థితి ఘోరంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఒక వేళ సపోర్టు చేయకపోతే.. వాడుకుని వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే .. జగన్ కు ఇలాంటి పరిస్థితి కల్పించడానికి అయినా శ్రీరెడ్డిని అరెస్టు చేయాలన్న డిమాండ్ టీడీపీ కార్యకర్తల నుంచి వస్తోంది.