ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వెళ్తారా అనే చర్చ అప్పుడే మొదలైంది. ఆ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు కేవలం పదికొండు మంది మాత్రమే కావడంతో అసెంబ్లీలో కూటమి సభ్యుల దూకుడును ఎదుర్కొనేందుకు జగన్ కు ఈ బలం సరిపోతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
2019ఎన్నికల్లో టీడీపీ పరాభవంతో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ రేంజ్ లో హేళన చేశారు. అసెంబ్లీ సాక్షిగా పరుష పదజాలంతో దూషించారు. కుటుంబ సభ్యులను కూడా వదల్లేదు. దీంతో ఇప్పుడు అలాంటి రియాక్షన్ కూటమి నుంచి ఎదురైతే జగన్ వాటన్నింటిని తట్టుకొని నిలబడుతారా అనేది అందరి మదిలను తొలచి వేస్తోన్న ప్రశ్న.
అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రజలందరి దృష్టి శాసన సభాపైనే ఉంటుంది. దీంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకొని ప్రశ్నలను జగన్ సంధించినా అవతలి వైపు నుంచి డైనమేట్లలా పేలే డైలాగ్ లను ఎలా ఎదుర్కొంటారు, వాటికి ఎలా సమాధానం చెబుతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
పైగా..అధికార పక్షం నుంచి వచ్చే కౌంటర్లను తిప్పికొట్టేందుకు జగన్ పక్కన దూకుడుగా వ్యవహరించే నేతలు కూడా ఈసారి లేకపోవడం వైసీపీకి లోటే. వీటన్నింటి నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండనున్నాయి..? జగన్ సభకు వెళ్తారా..? లేదంటే వేరే అంశాలను సాకుగా చూపి డుమ్మా కొడుతారా..? త్వరలోనే తేలనుంది.