విశాఖను రాజధానిగా ప్రచారం చేసుకోవడానికే పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నట్లుగా ఏపీ సీఎం జగన్ తీరు ఉంది. పెట్టుబడుల సదస్సు పెట్టి వివాదాస్పద ప్రకటనలు చేశారు. న్యాయస్థానంలో ఉన్న అంశాలను .. చట్టాలను.. రాజ్యాంగాలను సైతం తాము పట్టించుకునేది లేదన్నట్లుగా విశాఖనే త్వరలో రాజధాని అవుతుందని తాను కూడా ఇక్కడి నుంచే పాలన చేస్తానని చెప్పుకొచ్చారు. జగన్ ఎక్కడి నుంచి పాలన చేస్తే పారిశ్రామికవేత్తలకు ఎందుకు ? అయినా సరే ఈ విషయాన్ని హైలెట్ చేసుకున్నారు.
ఇదే ప్రసంగంలో ఆంప్రదేశ్ కు 20 రంగాల పారిశ్రామికవేత్తల నుంచి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని ప్రకటించేశారు. 13 లక్షల కోట్లా.. పదమూడు పక్కన ఎన్ని సున్నాలుంటాయో తెలుసా అని .. నెటిజన్లు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ కనీసం.. ఓ వంద కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చి ఉద్యోగాలిచ్చిన పరిస్థితి లేదు కానీ.. ఇలా లక్షల కోట్ల ప్రకటనలు మాత్రం ఘనంగా చేయడం కామెడీ అవుతోంది.
ఈ పెట్టుబడుల వల్ల 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. 340 పెట్టుబడుల ప్రతిపాదనలు మా ముందుకు వచ్చాయి.. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని. శుక్రవారం రూ. 8.54 లక్షల కోట్ల ఎంవోయూలు జరుగుతాయని వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆరు పోర్టులు.. ఆరు ఎెయిర్ పోర్టులతో అత్యధిక మానవ వనరుల శక్తి ఏపీ కలిగి ఉన్నదని సీఎం జగన్ పారిశ్రామిక వేత్తల దృష్టికి తీసుకెళ్లారు. దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి ఉన్న రాష్ట్రం ఏపీ అని సీఎం తెలిపారు.
పెట్టుబడుల సదస్సుకు ముఖేష్ అంబానీ వచ్చారు. ఆయన ఇతమిత్థంగా ఇంత పెట్టుబడి అని చెప్పలేదు. 10 గిగావాట్ల రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక కడప స్టీల్ ప్లాంట్ కడతానని ముందుకు వచ్చిన నవీన్ జిందాల్ ఆ పని ఇంకా ప్రారంభించక ముందే క్రిష్ణ పట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ రూ. పదివేల కోట్లతో పెడతానని ప్రకటించారు. ఇక జీఎంఆర్…సహా ఇతర పారిశ్రమికవేత్తలు చాలా పొగడ్తలు కురిపించారు .. కానీ ఇతమిత్థమైన పెట్టుబడులు చేయలేదు.