బీజేపీయేతర ముఖ్యమంత్రులందరూ సమావేశం కావాలని నిర్ణయించారు . కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి వారు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మమతా బెనర్జీ, కేసీఆర్, స్టాలిన్ ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నారు. అయితే అందరి దృష్టి ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉంది. ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనపై ఉన్న కేసులు, ఏపీ ఆర్థిక పరిస్థితి తదితర అంశాలతో ఆయన కేంద్రంతో విభేదించే పరిస్థితి లేదు. కేంద్రం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని సమర్థించాల్సిన స్థితిలో పడిపోయారు. అయితే ఆయనకు స్టాలిన్, కేసీఆర్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ రాజకీయ వ్యూహాలను జగన్ అమలు చేస్తారన్న ప్రచారం కూడా ఉంది.
ఈ క్రమంలో జగన్‌ను బీజేపీయేతర సీఎంల కూటమి సమావేశానికి రప్పించేలా కార్యాచరణ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా కేంద్రంపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం ఎక్కువగా ఉంది. తాజాగా కేంద్రం అప్పులు కూడా తీసుకోనివ్వడం లేదన్న విషయాన్ని బహిరంగ పరిచారు. ప్రత్యేకహోదాను చర్చల అజెండాలో పెట్టి తీసేయడంపై చర్చ జరుగుతోంది. దీంతో రేపో మాపో కేంద్రంపై జగన్ విమర్శలు ప్రారంభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆ తర్వాత ఆటోమేటిక్‌గా కేంద్రం సహకరించడం లేదని.. కేంద్రానికి వ్యతిరేకగా జరిగే బీజేపీయేతర సీఎం భేటీకి జగన్ హాజరవుతారని భావిస్తున్నారు. కేసీఆర్ వ్యూహం ఫలిస్తే ఇలాగే జరుగుతుందని కానీ బీజేపీతో సన్నిహిత సంబంధాలను వదిలి పెట్టడం జగన్‌కు ఇష్టం లేకపోతే మాత్రం .. ఆయన ఎప్పట్లాగే సైలెంట్‌గా ఉంటారని భావిస్తున్నారు. లాభనష్టాలు బేరీజు వేసుకుని జగనే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ జగన్ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయని తేలిపోయింది