ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా వేదికపై ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలు ఇద్దరే ఇద్దరు. ఒకరు తెలంగాణ సీఎం కేసీఆర్, రెండో వ్యక్తి తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్. ఇద్దరూ జగన్మోహన్ రెడ్డిని పొడిగారు. తాము కలిసి కేంద్రంపై పోరాడతామన్న సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత కలిసి పోరాడేంత జాతీయ సమస్య పెద్దగా రాలేదు.. కానీ ఇప్పుడు వచ్చింది. అదే నీట్ – జేఈఈ పరీక్ష. నిర్వహించి తీరుతామని కేంద్రం ప్రకటిస్తోంది. వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలా వాయిదా కోరుతున్న వారిలో డీఎంకే చీఫ్ స్టాలిన్ ఉన్నారు. ఆయన దూకుడుగా కేంద్రం నిర్ణయంపై పోరాడుతున్నారు.
తాజాగా ఆయన నీట్ – జేఈఈ వాయిదా కోసం జాతీయ స్థాయి ఉద్యమాన్ని చేపట్టారు. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులైన జగన్, కేసీఆర్‌లను ఇందుకు కలిసి రావలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పరీక్షల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. నీట్-జేఈఈ నిర్వహణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలపాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ బృందంలో… కేసీఆర్, జగన్ చేరుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
బీజేపీయేతర ప్రభుత్వాలు అయినప్పటికీ… కేసీఆర్, జగన్ మాత్రం.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి పెద్దగా ఆసక్తి వ్యక్తం చేయడం లేదు. నీట్ – జేఈఈ పరీక్ష నిర్వహణపై తెలుగు రాష్ట్రాలు ఇంత వరకూ .. తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదు. అయితే.. కరోనా కేసులు ఎలా ఉన్నా.. బడులు ప్రారంభించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు కాబట్టి.. ఆయన తన విధానం పరీక్ష నిర్వహించడమేనని పరోక్షంగా చెప్పినట్లయింది. కేసీఆర్ కూడా అంతే. అంటే.. మిత్రుడు స్టాలిన్ పిలుపునకు వారు స్పందించే అవకాశాల్లేవేని భావించవచ్చు.