ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు సాక్షి మీడియాలో చేరిన సంగతి తెలిసిందే. జగన్ ఆలోచనలకి అద్దం పట్టే సాక్షి మీడియాలో కొమ్మినేని నిష్పక్షపాతంగా తన ‘కెఎస్ఆర్ లైవ్ షో’ నిర్వహించగలరా? చంద్రబాబు నాయుడుని విమర్శించినట్లుగా ఆయన జగన్మోహన్ రెడ్డిని విమర్శించగలరా? ఆయన ధైర్యం చేసినా, తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే జగన్మోహన్ రెడ్డి సహించగలరా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
అయితే కెఎస్ఆర్ లైవ్ షో నిర్వహణ విషయంలో కొమ్మినేనికి సాక్షి మీడియా యాజమాన్యం పూర్తి స్వేచ్చనిచ్చినట్లు సమాచారం. అది నిజమా కాదా? నిజమే అయితే ఎంత కాలం జగన్ సహనం వహించగలరు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొమ్మినేనికి ఈ ఇబ్బందుల గురించి తెలుసు కనుక ఆయనే కొంచెం బ్యాలన్స్ గా తన షోని నడిపించుకోవలసి ఉంటుంది. లేకుంటే ఆయన పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో దూకినట్లవుతుంది.
అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజలలో ఎంతో కొంత వ్యతిరేకత నెలకొనే ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. ప్రభుత్వం తనతో వ్యవహరించిన తీరుపట్ల కొమ్మినేని కూడా చాలా అసంతృప్తిగానే ఉన్నారు. కనుక కొమ్మినేని తన షోలో తెదేపా ప్రభుత్వంపై అస్త్రశస్త్రాలు సందించే అవకాశాలున్నాయి. సాక్షిలో ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన ఎన్ని బాణాలు వేసినా కాదనేవారుండరు. పైగా అందుకు జగన్మోహన్ రెడ్డి చాలా సంతోషిస్తారు కూడా. కనుక ఆ పంధాలోనే కొమ్మినేని షో కొనసాగుతుందేమో? చూడాలి.