పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో వైసీపీదే హవా. అక్కడి గిరిజనులు సంప్రదాయంగా వైసీపీ ఓటు బ్యాంక్. అప్పట్లో వైఎస్ .. ఇప్పుడు జగన్ కు ఏకపక్షంగా ఓట్లేస్తారు. పోలవరం నిర్వాసితులే కాదు మొత్తం గిరిజన ప్రాంతాల్లో వారిదే హవా. కానీ వారు మాత్రం ఒకరు బాక్సైట్ పేరుతో.. మరొకరు పోలవరం పేరుతో అమాయక గిరిజనుల్ని నట్టేట ముంచడానికి ప్రయత్నించారు. ఇంకా చేస్తున్నారు.
పోలవరం నిర్వాసిత గ్రామాల్లో జగన్ ఎప్పుడు పర్యటించినా .. ముంపు బాధితులకు అదనంగా పది లక్షలిస్తానని హామీ ఇచ్చేవారు. అధికారంలోకి వచ్చాక జీవో ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చేశారు. గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మిగిలిన మొత్తం ఇస్తామని చెప్పుకొచ్చారు. అంటే గత ప్రభుత్వం ఆరున్నర లక్షలు ఇస్తే ఈ ప్రభుత్వం మరో మూడున్నర లక్షలు ఇస్తుంది. మూడున్నరేళ్లు దాటిపోయింది.. ఇప్పటికైనా ఇస్తారా అంటే త్వరలో ఇస్తామనే కబుర్లు చెబుతున్నారు. గతంలో జగన్ పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో ఎలాంటి హామీలు ఇచ్చారో చాలా స్పష్టంగా వీడియోలు ఉన్నాయి.
అదే సమయంలో పోలవరం నిర్వాసితులందరికీ పరిహారం ఇస్తామని చెప్పడం లేదు. అసలు పోలవరంలో మొదటిదశ.. రెండో దశ అనేది లేదు. కానీ కొత్తగా 41 మీటర్ల లెక్క పెట్టుకుని అక్కడి వరకూ నీరు నిల్వ చేస్తే.. ఎంత మందికి పరిహారం చెల్లించాలో వారికే చెల్లిస్తామని చెబుతున్నారు. డ్యాం కట్టేసిన తర్వాత నీరు నిల్వ చేసి నిర్వాసితుల్ని నట్టేట ముంచేసి.. తప్పు చేస్తే మీ బిడ్డను క్షమించండి అంటూ.. కడప జిల్లాలోనే మాట్లాడిన చరిత్ర సీఎంది. అలాంటిది ఇక పోలవరం నిర్వాసితుల్ని ఆలా చేయకుండా ఉంటారా ?
పదవి పొందడానికి ఎన్ని మాటలైనా చెప్పవచ్చు కానీ.. పదవి పొందిన తర్వాత ఇంత దారుణంగా మాట తప్పి.. ప్రతి ఒక్కరినీ మోసం చేయడం వల్ల పోయేది పరువే. అసలు అంబటి రాంబాబు అలాంటి హామీ ఇవ్వలేదని వాదించారు. కానీ జగనే ఇచ్చాను అని తెర ముందుకు వచ్చి… ఈ వ్యాఖ్యలు చేశారు. అందులో అసలు మోసం బయటపడింది. పాలకులు ప్రతిపక్షాలకు చెప్పుకోవడానికి కాకపోయినా నమ్మిన అమాయక గిరిజనుల గురించైనా ఆలోచించాలి. తాము చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలి