వ్యాక్సిన్ విధానంలో గందరగోళం.. రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపుతున్న కేంద్రం వైఖరి.. కోఆపరేటివ్ ఫెడరలిజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోడీ విషయంలో కలసికట్టుగా పోరాడదాం రమ్మని.. కేరళ సీఎం పినరయి విజయన్ పదకొండు మంది ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వారిలో సీఎం జగన్ కూడా ఉన్నారు. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైఎస్ జగన్‌కు ట్యాగ్ కూడా చేశారు. ఇప్పుడు అందరూ.. సీఎం జగన్ ట్విట్టర్ అకౌంట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన ఏం రిప్లయ్ ఇస్తాడా అని ఉత్కంఠకు గురవుతున్నారు.
ఎందుకంటే.. గతంలో వ్యాక్సిన్లు.. కరోనా కట్టడి అంశంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని మోడీని విమర్శిస్తూ ట్వీట్ చేస్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. నిజానికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. హేమంత్ సోరెన్ జగన్‌కు ట్యాగ్ కూడా చేయలేదు. అయినప్పటికీ.. ఆయన హేమంత్ సోరెన్‌ను విమర్శిస్తూ.. రీ ట్వీట్ చేశారు. ఇప్పుడు.. కేరళ సీఎం అంత కంటే ఘాటుగా ప్రధాని మోడీని విమర్శిస్తూ.. జగన్‌కు లేఖ రాశారు. ట్వీట్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హేమంత్ సోరెన్ ఎస్టీ వర్గానికి చెందిన సీఎం అయినందునే.. విమర్శించారని.. అదే సమయంలో చాలా మంది సీఎంలు మోడీని విమర్శిస్తున్నా జగన్ పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు పినరయి విజయన్ అంశంపై స్పందించకపోయినా అలాంటి విమర్శలే వస్తున్నాయి. పినరయి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ.. ట్వీట్ చేస్తే బీజేపీకి కోపం వస్తుంది. సమాధానం ఇవ్వకపోతే.. ప్రజలకు అనుమానం వస్తుంది. సీఎం జగన్.. హేమంత్ సోరెన్ విషయంలో అనవసరంగా స్పందించి చేసిన ట్వీట్ల వల్ల… తరచూ ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.