మాటంటే ముందే.. దేవుడి ప్రస్తావన తీసుకు వచ్చే జగన్మోహన్ రెడ్డి.. కరుణామయుడ్ని గుర్తించకపోవడం ఏమిటంటారా..? అయితే.. నిజమైన కరుణామయుడు ఆయన గుండెల్లోనే ఉంటారు.. కానీ. వెండితెర కరుణామయుడు.. ఆయన వెంట .. ఏళ్ల తరబడి.. తిరుగుతున్నా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఆయనే… విజయ్ చందర్. కరుణామయుడి సినిమాల్లో.. ఓ గుర్తింపు తెచ్చుకుని.. దాన్ని ఇప్పటికీ కాపాడుకుంటున్న విజయ్ చందర్.. వైఎస్ ఫ్యామిలీకి.. వీరభక్తుడు. వైఎస్ ఉన్నప్పుడే.. ఆయనకు మద్దతుగా ఉండేవారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి.. ఓ రేంజ్లో సపోర్ట్ చేశారు. ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడకు వెళ్లారు. వైసీపీ తరపున ఎలాంటి ప్రచారానికైనా సిద్ధపడేవారు. చాలా మంది నేతలు.. జగన్ అధికారంలోకి వచ్చాకో.. వస్తారని అంచనా వేశాకో.. జగన్ పంచన చేరారు కానీ.. విజయ్ చందర్ మాత్రం మొదటి నుంచి జగన్ తోనే ఉన్నారు.
అయితే.. విజయ్ చందర్‌కు .. ఇప్పటి వరకూ ఎలాంటి గుర్తింపు లభించలేదు. ఆయన కూడా పదవుల కోసం కాదన్నట్లుగా… జగన్ వెంట తిరుగుతూ ఉంటారు. వైసీపీ తరపున ఎలాంటి ప్రోగామ్ ఉన్నా.. సొంత ఖర్చులతోనే వెళ్లేవాళ్లు. అయితే.. ఇప్పుడు ఆయనను గుర్తించే సమయం వచ్చిందని.. జగన్మోహన్ రెడ్డి ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. నమ్ముకున్నోళ్లకి ఒక్కొక్కరికి పదవులు ఇచ్చుకుంటూ వెళ్తున్న జగన్ జాబితాలో.. తర్వాతి పేరు విజయ్ చందర్‌దే అంటున్నారు. విజయ్ చందర్ పేరు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఎంపిక చేసినట్లుగా.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన ఏ క్షణమైనా రావొచ్చంటున్నారు.
టీడీపీ హయాంలో… అంబికా కృష్ణ.. ఏపీఎఫ్డీసీ చైర్మన్ గా ఉండేవారు. వైఎస్ హయాంలో.. ఘట్టమని ఆదిశేషగిరిరావుకు ఆ పదవి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఎపీఎఫ్‌డీసీ పదవి కోసం చాలా పెద్ద పేర్లే వినిపించాయి. మోహన్ బాబు, జయసుధ, అలీ లాంటి పేర్లు వినిపించాయి. అయితే.. వీరంతా… ఎన్నికలకు ముందు… వైసీపీలోకి వచ్చిన వారే. ఎప్పటి నుండో.. పార్టీకి సేవ చేసిన వారికి చాన్సివ్వాలనుకున్న జగన్ విజయ్ చందర్ వైపు మొగ్గినట్లుగా చతెబుతున్నారు.