రోజాకు టిక్కెట్ నిరాకరిస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే రోజాకు టిక్కెట్ నిరాకరించేంత ధైర్యం సీఎం జగన్ కు.. కానీ ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ లేదని వైసీపీలోని ఓ వర్గం బలంగా నమ్ముతోంది. రోజా అంటే ఎందుకు అంత భయం అంటే.. ఆమె నోరే. ఆమెతో తేడా వస్తే.. ఎలా మాట్లాడుతుందో అందరికీ తెలుసు. అసలు చివరి క్షణం వరకూ రోజాకు మంత్రి పదవుల జాబితాలో చోటు లేదు. మరి ఎందుకు ఇచ్చారు ? మంత్రి పదవి దక్కకపోతే రోజా చేసే రచ్చ.. ఆమెకు మీడియా ఇచ్చే కవరేజీ ఊహించుకుని భయపడే మంత్రి పదవి ఇచ్చారు.
అంతే తప్ప.. ఆమెకు ఇవ్వాలని కాదు. ఉమ్మడి చిత్తూరులో అప్పటికే పెద్దిరెడ్డి ఉండగా.. మరో రెడ్డి అయిన రోజాకు ఇవ్వాల్సిన అవసరంలేదు. ఈ సారి కూడా ఆమెకు సీటు లేదని ప్రచారం చేస్తున్నారు కానీ.. రోజా తిరుగుబాటు చేస్తాననే సంకేతాలు పంపితే అలాంటి పని చేయవద్దని వెంటనే టిక్కెట్ ప్రకటిస్తారు. రోజా.. జగన్ రెడ్డిపై నమ్మకంతో .. టీడీపీ వాళ్లను ఇష్టారీతిన తిట్టింది. పవన్ నూ వదల్లేదు. ఆమెకు వైసీపీ తప్ప మరో రాజకీయ వేదిక లేదు. ఉండదు కూడా.
అలా అన్ని ఆప్షన్లను వదులుకుని ఉంటే.. ఇప్పుడు టిక్కెట్ నిరాకరిస్తారా అని ఆమె రెచ్చిపోతే… జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి తట్టుకోలేరన్నది ఎక్కువ మంది భావన. ఆమెకు టిక్కెట్ నిరాకిరంచే చాన్సే లేదని ఇలా ప్రచారం చేసి.. ఆమెను మానసికంగా సిద్దం చేయాలనుకుంటారేమో కానీ.. అది సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది.