కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమౌతోంది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కడప జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… డిసెంబర్ 26న కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తానన్నారు. గత పాలకులు ఈ పరిశ్రమ పేరుతో చాలా నాటకాలు ఆడారంటూ విమర్శించారు. వారి తీరు వల్లనే పరిశ్రమ ఏర్పాటు పనులు నిలిచిపోయాయన్నారు. కడపలో పరిశ్రమకు తాను శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభిస్తాననీ, మూడేళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందన్నారు. దీని ద్వారా దాదాపు 20 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.
కడప ఉక్కు కర్మాగారం… ఏపీ విభజన చట్టంలో ఉన్న కీలక అంశాల్లో ఇదీ ఒకటి. అయితే, గత భాజపా కేంద్ర ప్రభుత్వం దీనిపై శ్రద్ధ పెట్టలేదు. పార్లమెంటులో ఎన్నిసార్లు ఈ అంశం టీడీపీ ఎంపీలు లేవనెత్తినా పెద్దగా పట్టించుకోలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి రావడంతో ఇది పూర్తిగా రాజకీయాంశంగా మారిపోయింది. ఆ తరువాత, సెయిల్ నివేదిక తెరమీదికి వచ్చింది. తెలంగాణలోని బయ్యారంతోపాటు, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయాలని మాత్రమే విభజన చట్టంలో ఉందనే వాదనను కేంద్రం వినిపించింది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనువైన పరిస్థితులు లేవని సెయిల్ నివేదిక ఇచ్చిందని నాటి భాజపా సర్కారు పరిశ్రమ ఏర్పాటుకు బ్రేకులు వేసింది. ఆ తరువాత, నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఎంత ప్రయత్నించినా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో… చివరికి రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ. 20 వేల కోట్లతో నిర్మించాలని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. అంత భారీ మొత్తంలో నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమీకరించగలదా అనే ప్రశ్న అప్పుడే చర్చకు వచ్చింది.
ప్రస్తుతానికి వస్తే… ఈ మధ్య కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కడప ఉక్కు కర్మాగార ప్రస్థావనే లేదు. ఇప్పుడీ ప్రాజెక్టు మూడేళ్లలో నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు కూడా ప్రశ్న ఏంటంటే… నిర్మాణానికి నిధులు ఎలా వస్తాయనేది? ఏపీకి బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ, నిధులను విడుదల చేయాలంటూ కేంద్రానికి వినతి పత్రాలు ఇవ్వడానికి ఏపీ సీఎం సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంలోనే కడప పరిశ్రమ ఏర్పాటుకు నిధులను కూడా కేంద్రం నుంచి అడిగే అవకాశం ఉంటుంది. ఇది కేంద్రం చెయ్యాల్సిన పని, కాబట్టి కేంద్రం నుంచి సాయం వచ్చేలా ప్రయత్నిస్తేనే మంచిది. మరి, సీఎం ఆ దిశగా ఆలోచిస్తున్నారా లేదా అనేది మున్ముందు తెలుస్తుంది.