కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ బ్లూ ప్రింట్ రూపొందించారు. దాన్ని సోనియాకు సమర్పించారు. ఆ అంశంపై నాలుగు రోజుల పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు విస్తృతంగా చర్చించారు. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక విషయాలు ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ జగన్‌తో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సిఫార్సు చేశారు. అలా పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలన్నారు.
ఏపీకి సంబంధించి ప్రశాంత్ కిషోర్ చేసిన సిఫార్సు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది., వైసీపీకి ఇంకా పీకే సేవలు అందిస్తున్నారు. ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం వచ్చే ఎన్నికల కోసం వైసీపీకి పని చేయడం ప్రారంభించింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌తో పొత్తుకు సిఫార్సు చేశారంటే.. వైసీపీ ముఖ్య నేతల అనుమతి కూడా ఉండే ఉంటుందని భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలపై జగన్‌కు నమ్మకం ఎక్కువే ఉంటుంది. అయితే ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున ఇప్పుడే ప్లేటు ఫిరాయిస్తే.. కేసుల ఇబ్బందులు ఉంటాయని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ ఓటు బ్యాంక్ .. వైసీపీ ఓటు బ్యాంక్ ఒక్కటే. అందరూ అనుకుంటున్నట్లుగా రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ కి ఈ దుస్థితి రాలేదు.. కేవలం జగన్ పార్టీ పెట్టడం వల్లనే అనేది అందరూ అంతర్గతంగా అంగీకరించే విషయం. ఇప్పుడు జగన్ బీజేపీతో అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల మైనార్టీలు, దళితులు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వారు ఒకటి, రెండు శాతం వైసీపీకి దూరం జరిగినా.. తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమీకరణాలన్నీ ప్రశాంత్ కిషోర్ వైసీపీకి చెప్పి ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఎలా చూసినాప్రశాంత్ కిషోర్ .. వైసీపీ అనుమతి లేకుండా కాంగ్రెస్‌కు పొత్తు ప్రతిపాదన చేయరని అనుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్‌తో ఆయనకు అంత సాన్నిహిత్య ఉంది. అంటే ఏపీ రాజకీయాల్లో ఈ సారి జగన్ , కాంగ్రెస్ కలిసి వెళ్తాయన్నమాట. ఈ విషయం ఢిల్లీలో బీజేపీ పెద్దలు నమ్మితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ?