ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు రోజులు కార్యకర్తలకు కేటాయించారు. అయన రెండు రోజులు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు పెట్టుకోలేదు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్లు కూడా అక్కర్లేదు. నేరుగా రావొచ్చని వైసీపీ ప్రకటించింది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. అదే సమయంలో బ్రదర్ అనిల్ లాంటి వాళ్లు కూడా తాము కలిసి రెండున్నరేళ్లయిందని చెప్పుకుంటున్నారు.
ఇక ఇతర నేతలయితే.. తమ బాధలు చెప్పుకునేందుకు చాన్సివ్వడం లేదని వాపోతున్నారు. దీంతో జగన్ ఏరు దాటాక తెప్ప తగలేశారని..క్యాడర్ను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం బలంగా వెళ్లిపోతోంది. ఓ వైపు ప్రభుత్వం వస్తే ఏదో వస్తుందని ఆశించిన కార్యకర్తలకు నిరాశే మిగిలింది. చిన్న చిన్న పనులు చేసినా బిల్లులు రాక తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలతో సమావేశం కావాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. రెండురోజుల పాటు సమయం కేటాయించి వారి బాధలు విననున్నారు.
హఠాత్తుగా కార్యకర్తలకు రెండు రోజులు కేటాయించడం వైసీపీలోనే చర్చనీయాశం అవుతోంది. ప్రజల సంగతి తరవాత ముందు.. సొంత పార్టీలో అసంతృప్తి పెరుగుతోందన్న విషయాన్ని జగన్ గుర్తించారని భావిస్తున్నారు. అయితే ఇలా రెండు రోజుల్లో ఎంత మందిని కలుస్తారని.. కార్యకర్తలతో సన్నిహితంగా ఉండటం అంటే… రెండు రోజుల భేటీలు కాదని అంటున్నారు. అయితే సీఎం జగన్ కార్యకర్తలతో.. పార్టకి పెరుగుతున్న దూరాన్ని కాస్త తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని అనుకోవచ్చు.