ఏపీలో అధికారాన్ని బీజేపి ఎంత వరకు ఎంజాయ్ చేస్తోందో గాని… తెలంగాణాలో మాత్రం బిజేపికి విజయం అత్యంత కీలకం. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపి మెయిన్ గేటుగా భావించే కర్ణాటకలో అధికారం కోల్పోవడం, తెలంగాణాలో విజయలక్ష్మి వరించకపోవడం బిజేపిని కలవరపెడుతున్న అంశం. గత పదేళ్లుగా కేసీఆర్… బీజేపికి సహకరించినా అధికారం లేదనే లోటు కమలం పార్టీలో ఉంది. ఒడిస్సా లాంటి రాష్ట్రంలో పాతుకుపోయినా బిజూ జనతాదళ్ ను ఓడించి అధికార పీఠం ఎక్కిన కాషాయ పార్టీ… తెలంగాణాలో మాత్రం అధికారం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కమలం పార్టీకి దక్కడం లేదు. చివరికి ఏపీలో ఎన్డియే రూపంలో అధికారంలో ఉన్నా తెలంగాణాలో అది కూడా సాధ్యం కావడం లేదు. అందుకే ఇప్పుడు బీజేపి… హైదరాబాద్ నుంచి రాజకీయం మొదలుపెడుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో పీఠం ఈసారి ఎలా అయినా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బీఆర్ఎస్ ను చీల్చడానికి సిద్దమైంది అనే ప్రచారం ఇప్పటికే నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల ఏపీ సిఎం చంద్రబాబును కలిసి తెలుగుదేశంలోకి వచ్చేందుకు సిద్దం అని చెప్పడం వెనుక బిజేపి హ్యాండ్ ఉందనేది బీఆర్ఎస్ భయం.
అసలు కాంగ్రెస్, బీజేపి వేరు కాదనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆందోళన. అందుకే వికారాబాద్ అడవుల్లో శంకుస్థాపన చేసిన నేవీ రాడార్ ను అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ ఏ పార్టీ అని అడిగారు. జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తుంటే… కాంగ్రెస్ లేదా బిజేపి అన్నట్టుగానే రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపి సిద్దమైంది. ఇక వచ్చే ఏడాది జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి ఈ ఏడాది చివరిలోపు ఓ అంచనాకు వచ్చేయాలని కమలం పార్టీ భావిస్తోంది. అందుకే జనసేన విషయంలో ఏం చేయాలనేది బిజేపి రాష్ట్ర నేతలు ఆలోచనలో పడ్డారు.
జనసేనను కూడా ఎన్నికల బరిలో దించాలా వద్దా అనే దానిపై ఇప్పుడు అంతర్గత చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఏపీ ఫార్ములాను ఇక్కడ ఫాలో అవ్వాలా లేకపోతే తెలుగుదేశంతో మాత్రమే కలిసి వెళ్ళాలా అనేది బీజేపికి అర్ధం కావడం లేదు. తెలంగాణాలో జనసేన క్యాడర్ పై బిజేపికి అంచనా లేదు. హైదరాబాద్ లో గోదావరి జిల్లాల వాళ్ళు ఉన్నా వారిలో కాపు సామాజిక వర్గ ఓటింగ్ ఎంత అనేది కూడా క్లారిటీ లేదు. జనసేనకు ఏపీలో కాపు ఓటింగ్ బలం. హైదరాబాద్ లో కాపు ఓటింగ్ ఏపీ నుంచి వెళ్ళిన వాళ్ళే.
కేవలం మద్దతు మాత్రం తీసుకుని, పవన్ తో ప్రచారం చేయించి… ఎన్నికల్లో మాత్రం టీడీపీతో కలిసి బరిలోకి దిగాలని బిజేపి యోచిస్తోంది. ఏపీ తరహాలో జనసేన తెలంగాణాలో రాజకీయం చేసి ఉంటే… అక్కడి ప్రజలకు ఆ పార్టీపై ఓ అవగాహన ఉండేది. కాని జనసేన అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా పర్యటనలు చేసిన పరిస్థితి లేదు. కాబట్టి అనవసరంగా జనసేనకు సీట్లు ఇచ్చి రిస్క్ చేసినట్టు అవుతోందేమో అనే ఆలోచనలో కమలం పార్టీ పెద్దలు ఉన్నారు. టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నం. ఆ పార్టీకి క్షేత్ర స్థాయి పట్టు ఉంది. బీజేపి కంటే హైదరాబాద్ లో టీడీపీనే గ్రౌండ్ లెవెల్ లో బలమైన పార్టీ. అందుకే ఇప్పుడు జనసేన మద్దతు మాత్రం తీసుకుని… పోటీ మాత్రం టీడీపీతో కలిసి చేయాలని బిజేపి వ్యూహం రచిస్తోంది. ఈసారి ప్రచారానికి అన్ని పార్టీల అగ్ర నేతలు దిగే అవకాశం ఉంది.