జూన్ ఏడో తేదీన అంటే గురువారం… నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ నిర్వహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సార్వత్రికి ఎన్నికల్లో .. విపక్షాల కూటమిని ఎంత సమైక్యంగా ఎదుర్కోవాలన్నదానిపై చర్చిస్తారు. అంతర్గతంగా మాత్రం ఈ సమావేశంలో.. కీలకమైన అంశం… మిత్రపక్షాలు తమను… వదిలి పెట్టకుండా బీజేపీ కాకాపట్టడమే. గతంలోలా..మిత్రపక్షాలను హీనంగా చూడటం లేదని.. కొత్తగా నిరూపించుకునే ప్రయత్నం చేయడానికే సమావేశం పెట్టారు. అందుకే.. సీట్లు, ఓట్ల తేడాలు చూపించకుండా… ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలన్నింటినీ పిలుస్తున్నారు. మరి ఇందులో జనసేనకు చోటుందా..? జనసేనకు పిలుపు అందుతుందా..?
ప్రత్యేకహోదా కోసం గతంలో అనంతపురం, కాకినాడల్లో సభలు పెట్టినప్పుడు… ఇష్టం వచ్చినట్లు విమర్శించిన పవన్ కల్యాణ్‌పై బీజేపీ నేతలు ఓ రేంజ్లో ఫైరయ్యారు. పవన్ కల్యాణ్ ఎన్డీఏలో ఉన్నారో లేరో తేల్చుకోవాలన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని రోజుల కిందట.. జాతీయ మీడియాకు పవన్ కల్యాణ్ ఇంటర్యూలిచ్చినప్పుడు తాను మోదీకి ఎంతో సన్నిహితుడనని చెప్పుకున్నారు. తానిప్పటికీ ఎన్డీఏలో భాగస్వామినేనని.. కేంద్రంలో ఏం జరుగుతుందో తనకు తెలియకుండా ఉంటుందా.. అని ప్రశ్నించారు. తనకు అన్నీ తెలుస్తున్నాయన్నారు. ఎన్డీఏలో భాగస్వామినేనని తేల్చి చెప్పారు.
దానికి తగ్గట్లుగానే ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కానీ.. నరేంద్రమోదీపై కానీ.. పవన్ కల్యాణ్ దారుణమైన విమర్శలు చేయడం లేదు. అచ్చంగా మిత్రపక్షంలాగే వ్యవరిస్తున్నారు. ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వకపోవడానికి… రాష్ట్ర ప్రభుత్వమే తప్పంటున్నారు కానీ.. కేంద్రానికే పాపం తెలియదంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఓ రకంగా యుద్ధమే చేస్తున్న సమయంలో… గత ఎన్నికల సమయంలో అదే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన.. ఆ స్టేటస్ ఉన్నట్లుగానే వ్యవహరిస్తోంది.
తాను ఎన్డీఏలోనే ఉన్నానని పవన్ కల్యాణ్ జాతీయ మీడియాకు వివరంగా చెప్పారు. మరి జనసేనను… బీజేపీ పరిగణనలోకి తీసుకుంటుందా..? తీసుకుంటే.. ఎన్డీఏ భేటీకి ఆహ్వానిస్తారా..? ఒక వేళ ఆహ్వానిస్తే పవన్ కల్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుంది..? అనేది… ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన అంశం అయింది.