జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై ఇలాంటి సమయంలో విమర్శలు చేయకూడదని.. అనుకున్నారు. ఆ ప్రకారం.. శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అందుకే… ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోకుండా.. తమ రాజకీయాలు తాము చేసుకుంటున్నా.. సైలెంట్ గా ఉన్నారు. దీనిపైనా విజయసాయిరెడ్డి … నాటు భాషలో విమర్శలు చేసినా పార్టీ పరంగా నాగబాబు మాత్రమే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు.. ప్రభుత్వం… మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు… టెస్టుల విషయంలో పారదర్శకత లేకుండా పోయింది. ఇలాంటి సమయంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే… అది రాజకీయం ఎలా అవుతుందన్న ప్రశ్న జనసేన నాయకుల్లో వస్తోంది.
ఓ వైపు తెలుగుదేశం పార్టీ… రాజకీయం చేస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నా… పకడ్బందీగా ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఆ పార్టీ నేతలు పేద కుటుంబాలకు.. రూ. ఐదు వేలు ఇవ్వాలని ఎక్కడికక్కడ దీక్షలు చేస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా బయటకు రాకుండానే.. పనులు పూర్తి చేస్తున్నారు. లేఖలు రాసి.. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇది వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. వ్యక్తిగతంగా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నా.. టీడీపీ వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో… ఏపీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విషయాలు బయటకు వస్తున్నాయంటున్నారు.
లెఫ్ట్ పార్టీలు కూడా.. తమ వంతు వాయిస్‌ను గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీరుపై వేగంగా స్పందిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వలస కూలీలు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కార్మికులను, వలస కూలీలను ప్రభుత్వం ఆదుకునేందుకు నిర్దిష్టమైన కార్యక్రమాలేమీ చేపట్టలేదు. దీనిపై స్పందించిన లెఫ్ట్ పార్టీలు.. కార్మికులకు సంక్షేమ బోర్డుల ద్వారా రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సీఎంకు లేఖ రాశాయి. వలస కార్మికులకు పునరావాసం, ఆర్థిక సాయం చేయాలని … మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందరికీ ఇవ్వాలని కోరాయి. రైతుల పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనాలని 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారికి చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలన్నీ… ఇలా ప్రజల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూండగా జనసేన మాత్రం.. సైలెంట్ మోడ్‌లోనే ఉండిపోయింది. ఈ విషయంపై పవన్ కల్యాణ్‌కు క్యాడర్ నుంచి.. అనేక సూచనలు వచ్చాయేమో కానీ.. శుక్రవారం… పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వానికి అందరినీ కలుపుకుని వెళ్లాలన్న ఆలోచన లేదని.. నిర్మాణాత్మక విమర్శలతో ప్రజల పక్షాన మాట్లాడదామని నేతలకు సూచించారు. లాక్ డౌన్ పొడిగింపుతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా… ప్రజల కోసం ప్రభుత్వంపై పోరాడటం ప్రారంభిస్తారో.. రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలకు భయపడి.. వెనక్కి తగ్గుతారో చూడాలి..!