సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి తగ్గలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పటికి జనసేన పార్టీకి రాజీనామా చేసేశారు. సినిమాలు చేయనన్న పవన్ కల్యాణ్ .. మళ్లీ సినిమాలు ప్రారంభించడంతోనే రాజీనామా చేశానని .. తన రాజీనామాకు అప్పట్లో కారణం చెప్పారు. ఆ తర్వాత కౌలుకు పొలం తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఓ స్వచ్చంద సంస్థ పెట్టి సామాజిక అంశాలపై ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆయన విశాఖ నుంచే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఏ పార్టీ అని చెప్పడం లేదు. ఇండిపెండెంట్‌గా అని చెబుతున్నారు .
మళ్లీ జనసేన పార్టీలో చేరడానికి ఆయనకు మొహమాటం అడ్డు వస్తుందని.. పవన్ కల్యాణ్ స్వయంగా ఆహ్వానిస్తే పార్టీలో చేరే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జేడీ స్వయంగా రాజీనామా చేసి.. ఇప్పుడు మళ్లీ రావాలని పవన్ ఆహ్వానించడం ఏమిటన్నది జనసేనలో కొంతమంది నేతల అభిప్రాయం కావొచ్చు. కొన్ని కారణాల వల్ల ఆయన బీజేపీలో చేరలేరు.. టీడీపీలో అసలు చేరలేరు. ఆయన మార్గం జనసేన మాత్రమే. అందులో చేరాలనే ఆయనకూ ఉందని.. ఆయన స్పందన ద్వారా తెలుస్తోంది. జనసేన – టీడీపీ ప్రజాస్వామ్య పరిరక్షణకే కలుస్తున్నాయని అంటున్నారు.
జేడీ ఎన్నికల రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నందున పవన్ కల్యాణ్ ఆయనను మళ్లీ ఆహ్వానించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలని పవన్ కోరుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందు ముందు జేడీ జనసేనలో చేరొచ్చని భావిస్తున్నారు. వీవీ లక్ష్మినారాయణ కూడా బెట్టు చేయకుండా ఓ మెట్టు దిగి పవన్ కల్యాణ్‌తో భేటీ అయితే సమస్య పరిష్కారం అవుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.