కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజుజు బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవ్యవస్థపై ఎవరూ ఊహించని దాడి జరిగింది. సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కిరణ్ రిజుజు నేరుగానే దాడి చేశారు. జడ్జిలను వారే ఎంపిక చేసుకోవడం ఏమిటని ప్రశ్నించేవారు. జడ్డిల ఎంపికలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉండాలనేవారు. అంతే కాదు కొలీజియం సిఫారసు చేసిన వారికి ఆమోదముద్ర వేయడంలో ఆలస్యం చేసేవారు. దీంతో న్యాయవ్యవస్థ వర్సెస్ కేంద్రం అన్నట్లుగా చాలా కాలం సాగింది.
అయితే ఒక కేంద్ర మంత్రి రాజ్యాంగ వ్యవస్థపై ఇలా దాడి చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉండదని ఎవరూ అనుకోరు. వారి ఆలోచనలకు అనుగుణంగానే ఆయన మాట్లాడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజంగా ఆయన తీరు వివాదస్పదం అయి ఉంటే.. మొదటే మందలించి ..అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆపి ఉండేవారు. కానీ ఆయన తన దాడిని యధేచ్చగా చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకే .. కొలీజియం తీవ్ర విమర్శలు చేసిన రిజుజును రాత్రికి రాత్రే తొలగించారు.
రిజుజుకు అప్రాధాన్య శాఖ ఇచ్చారు. కొత్త మంత్రిగా రాజస్తాన్ కు చెందిన మేఘ్వాల్ను నియమించారు. దీని వెనుక రాజకీయ సమీకరణాలు ఉన్నాయా లేవా అన్న సంగతి పక్కన పెడితే.. సుప్రీంకోర్టుతో ఘర్షణ పెట్టుకోవడం కన్నా.. స్మూత్ గా పని చేసుకుంటూ పోవడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.