ఏపీ సీఎం చంద్రబాబును JSW అధినేత సజ్జన్ జిందాల్ కలిశారు. ఆయనే కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని వేల ఎకరాలు తీసుకున్నారు. ఆ ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. ఇంకా ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. పెడతారో లేదో స్పష్టతలేదు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో తమ ప్రణాళికల్ని వివరించారో లేదో స్పష్టత లేదు. కడప స్టీల్ ప్లాంట్ పై ముందుకే వెళ్తామని నిర్మిస్తామని హామీ ఇచ్చి ఉంటే ఆ విషయాన్ని ఘనంగా చెప్పుకునేవారు. కానీ JSW నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
కేంద్రం స్టీల్ ఫ్యాక్టరీ మంజూరు చేస్తుందని చూసి చూసి అలసిపోయి చివరికి చంద్రబాబునాయుడు జమ్మలమడుగు వద్ద శంకుస్థాపన చేశారు. విదేశీ కంపెనీల కొలాబరేషన్ తో పూర్తి చేయాలనుకున్నారు. జగన్ సీఎం అయ్యాక.. ఎన్నికలకు ఆరు నెలల ముందు శంకుస్థాపన చేయడం మోసం .. నేను వెంటనే శంకుస్థాపన చేస్తున్నా ఇక కాస్కోండి అన్నారు. కానీ మొత్తంగా మూడు సార్లు శంకుస్థాపనలు చేసిన స్టీల్ ప్లాంట్ అనే బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు.
మొదటి సారి శంకుస్థాపన చేసి మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభం అన్నారు. మూడేళ్లలో ఉత్పత్తికాదు.. మూడున్నరేళ్లకు మళ్లీ శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ భూములు తీసుకున్న JSW జిందాల్ గోడలు కట్టుకున్నారు. స్టీల్ ఫ్యాక్టరీకి అవసరమైన అనుమతులు కూడా ఇంత వరకూ సంపాదించలేదు జిందాల్ కు అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం ఇష్టం లేదని జగన్.. ఒత్తిడితోనే శంకుస్థాపన చేశారని అంటున్నారు. దీనిపై చంద్రబాబుతో చర్చించి ఉంటే… కడప స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్ పై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.