నందమూరి బాలకృష్ణ చిరకాల స్నేహితుడు కదిరి బాబూరావుకు ఈ సారి టిక్కెట్ విషయం డైలమాలో పడింది. మామూలుగా అయితే ఆయనకు టిక్కెట్ లేదని ముందుగానే చంద్రబాబు చెప్పేసేవారు. అక్కడ ఏడాదిగా పార్టీ పరిస్థితిని అంచనా వేసి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు భావించారు. కానీ కదిరి బాబూరావు బాలకృష్ణ స్నేహితుడు. ఆయనను తప్పించే ప్రయత్నం చేయడం సాధ్యం కాదు. అందుకే ఇంత కాలం విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు టిక్కెట్ ఖరారు చేయాల్సి రావడంతో కదిరి బాబూరావును, ఉగ్రనరసింహారెడ్డిని చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు.
ఇద్దరూ చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. దీంతో ఉగ్రనరసింహారెడ్డిని ముఖ్యమంత్రి ఈ నెల 28లేదా వచ్చే నెల 1వ తేది తరువాత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. చేరిక కార్యక్రమానికి బాబూరావును కూడా హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. బయట మీడియాతో మాత్రం బాబూరావు ఎన్నికల్లో తానే తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు. కదిరి బాబూరావుకు కనిగిరిలో పరిస్థితులు అనుకూలంగా లేవన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఇప్పటికి రెండు సార్లు చంద్రబాబు బాలకృష్ణ మిత్రుడన్న కారణంగానే అవకాశం ఇచ్చారు. 2009లో నామినేషన్ కూడా సరిగ్గా వేయలేకపోవడంతో తిరస్కరణకు గురయింది. అప్పుడు ఓ స్వతంత్ర అభ్యర్థికి అక్కడ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉగ్రనరసింహారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండు వేల ఓట్ల తేడాతోనే విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో ఉగ్రనరసింహారెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. కానీ కదిరి బాబూరావు మాత్రం టిక్కెట్ తెచ్చుకుని విజయం సాధించారు. అయితే ఆయన పలు మార్లు చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. ఓ సారి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ట్రైనింగ్ ఇచ్చి మరీ ఓటింగ్ కు పంపితే చెల్లని ఓటు వేసి వచ్చారు. అప్పట్నుంచి ఆయనకు సీటు మార్పు ఖాయమని ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణను ఒప్పిస్తే ఆయన సీటుకు ఎసరు వచ్చినట్లే భావించవచ్చు.