ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే ముందుగా వేలి ముద్రలు, పాదముద్రలు సేకరిస్తారు. కానీ నెల్లూరు చోరీ ఘటనలో పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. వారి దర్యాప్తు సరిగ్గా సాగడం లేదు. ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించడం మంచిది అని.. నెల్లూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుకు రిపోర్టు ఇచ్చారు. దీంతో సుమోటోగా ఆ దొంగతనం కేసును విచారించారని హైకోర్టు నిర్ణయించింది. సీబీఐకి కూడా నోటీసులు జారీ చేసింది.
కోర్టులో దొంగతనం అంటే చిన్న విషయం కాదు. పోలీసులు కనీస విచారణ జరపకుండా.. పాత నేరస్తుల్ని అరెస్ట్ చేసి.. పాత సామాన్ల కోసం వారే దొంగతనం చేశారని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. కానీ పోలీసులు చెప్పిన కథనమే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అసలు సాక్ష్యాలు సేకరించే ప్రయత్నం కూడా చేయలేదని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ద్వారా తెలిసింది. కోర్టులో దొంగతనాన్ని పోలీసులు ఎందుకు ఇంత లైట్ తీసుకున్నారు… అసలు దీని వెనుక ఏం జరిగింది అన్నది వెల్లడి కావాల్సి ఉంది.
జిల్లా కోర్టులో ఒక్క కాకాణి కేసుకు సంబంధించిన ఫైల్స్ మాత్రమే చోరీ కావడం సంచలనం రేపుతోంది. దీని వెనుక కుట్ర ఉందని నమ్ముతున్నారు. అయితే పోలీసులు సాధారణ దొంగల పని అని చెబుతున్నారు. వారు వెదికి వెదికి కాకాణి ఫైల్స్ మాత్రమే చోరీ చేస్తారా అన్న సందేహాలకు సమాధానాలు లభించడం లేదు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇచ్చే విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది న్యాయవ్యవస్థపై జరిగిన దాడి కాబట్టి.. పోలీసులు సరైన దిశగా దర్యాప్తు చేయడం లేదని సాక్షాత్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదిక ఇచ్చారు కాబట్టి దీనికి ఎక్కువ చాన్సులు ఉన్నాయని భావిస్తున్నారు.
అయితే సీబీఐకి హైకోర్టు ఇచ్చిన ఏ కేసులోనూ ఇంత వరకూ ఫలితం రాలేదు. డాక్టర్ సుధాకర్ చనిపోయినా ఆయనకు న్యాయం జరగలేదు. వివేకా కేసు సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కోర్టులో చోరీ కేసు ఇచ్చినా అదే పరిస్థితి ఎదురవుతుందని.. దాని వల్ల ఏం లాభముంటుందనే నిరాశ ఎక్కువ మందిలో ఉంది. ఇది సీబీఐ వ్యవస్థ పనితీరుకు ఫీడ్ బ్యాక్ లాంటిదే.