కమల్‌హాసన్ సినిమాలకు ఓ విచిత్రమైన అలవాటు ఉంది. అవేం చెప్పిన టైమ్‌కి రావు. వాయిదాలు పడుతూనే ఉంటాయి. ‘విశ్వరూపం’ సినిమా చూడండి.. ఎన్ని తిప్పలు పెట్టిందో. ‘విశ్వరూపం 2’ అయితే అజా పజా లేదు. ఇదే సెంటిమెంట్ రాజకీయాల్లోనూ కొనసాగించబోతున్నాడు కమల్. తాను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని, ఈ వ్యవస్థ మొత్తాన్ని కడిగి పారేస్తానని స్పీచుల మీద స్పీచులు దంచి కొట్టేస్తున్నాడు. కమల్ స్పీడు చూస్తుంటే.. రాత్రికి రాత్రే పార్టీ పెట్టేసేంత ఊపు కనిపించింది. అయితే.. ఇప్పుడు మాత్రం సడన్‌గా రూటు మార్చాడు. ‘పార్టీ పెట్టడానికి మరో 10 నెలలైనా సమయం పడుతుంది’ అని చెబుతున్నాడు. ఇదేమైనా సినిమా, ముహూర్తాలూ, సీజన్లు చూసుకొని రావడానికి. కమలే స్వయంగా పది నెలలు సమయం అడిగాడంటే… కచ్చితంగా 2019 ఎన్నికల ముందే వచ్చే అవకాశాలున్నాయన్నమాట.
కమల్‌కి పది నెలల సమయం ఎందుకు? ఈలోగా ఏం చేస్తాడు? అనే చర్చ మొదలైంది. ఇప్పుడున్న వేడి పది నెలలకు ఉండొచ్చు, ఉండకపోవొచ్చు. కమల్ ఎప్పుడూ ఇలా స్పీచులు ఇస్తూ, పార్టీ మొదలెట్టే విషయంలో కాల యాపన చేస్తే ప్రజలు కూడా కమల్ని నమ్మరు. ”పార్టీకి సంబంధించిన మరింత విస్క్రృతమైన చర్చ జరగాలి.. ఇంకా ఇలాంటి సమావేశాలు ఎన్నో అవ్వాలి” అని సగటు రాజకీయ నాయకుడిలానే మాట్లాడుతున్నాడు కమల్. అతనిలో జనాలకు నచ్చేది దూకుడు మాత్రమే. అదే లేనప్పుడు ఇప్పుడు ఎలా నమ్ముతారు. కమల్ చేతిలో రెండు కీలకమైన సినిమాలున్నాయి. వాటిని వీలైనంత త్వరగా విడుదల చేసుకోవాలి. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తరవాత నటుడిగా తన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేడు. అందుకే రాజకీయ పార్టీ ప్రకటించే లోపే తన సినిమాల్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు కమల్. `భారతీయుడు2` కథ ద్వారా తన ఉద్దేశ్యాలు తమిళ ప్రజలకు చెప్పాలని కమల్ డిసైడ్ అయ్యాడు. ఈ సినిమా పూర్తయ్యే సరికి మరో యేడాదైనా గడుస్తుంది. భారతీయుడు కోసమే కమల్ తన పార్టీని పది నెలల వరకూ ప్రకటించకూడదని డిసైడ్ అయ్యాడేమో.