పాపం విష్ణు… ‘కన్నప్ప’ కోసం ఎంత కష్టపడినా ఫలితం దక్కేలా కనిపించడం లేదు. నిజానికి నిన్నా మొన్నటి వరకూ ‘కన్నప్ప’పై కాస్తో కూస్తో హైప్ ఉండేది. ప్రభాస్, మోహల్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్లాంటి స్టార్లు ఈ ప్రాజెక్ట్ లో పాలు పంచుకోవడం, వంద కోట్ల పైచిలుకు బడ్జెట్తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు ప్రచారం చేయడంతో ‘కన్నప్ప’పై దృష్టి సారించారు. విష్ణు సినిమాల్లో ఇదివరకెప్పుడూ రానంత క్రేజ్ ‘కన్నప్ప’ దక్కించుకొంది. ఇదే ఫ్లో కంటిన్యూ అయితే, బిజినెస్ పరంగా పెద్దగా బెంగ పడాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే ‘కన్నప్ప’ టీజర్ బయటకు వచ్చిందో అప్పటి నుంచీ.. యధావిధిగా ట్రోలింగ్ పెరిగిపోయింది.
టీజర్లోని ఏ ఫ్రేములోనూ ఇది వంద కోట్ల సినిమాగా కనిపించలేదు. ఒక్క సెట్ లేదు. న్యూజిలాండ్ లో చిత్రీకరణ చేశారు కాబట్టి, ఆ మాత్రం లొకేషన్లయినా కనిపించాయి. లేదంటే అదీ లేదు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్, కాజల్.. వీటిలో ఒక్క పాత్రని కూడా సరిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. ‘కన్నప్ప’ అంటే ఓ భక్తుడుగానే తెలుసు. ఆయన్ని ఓ యుద్ధ వీరుడిగా చూపించే ప్రయత్నం చేశారిందులో. అందరికంటే ముఖ్యంగా ‘కన్నప్ప’గా విష్ణు గెటప్ కూడా పెద్దగా సూట్ కాలేదు. దాంతో `కన్నప్ప`పై మీమ్స్, ట్రోల్స్ మొదలెట్టేశారు. ఇందులో ప్రభాస్ ఉన్నాడన్న కనికరం కూడా చూపించలేదు మీమర్స్. టీజర్ బయటకు వచ్చినప్పటి నుంచీ ఒకటే బ్యాటింగు. దాంతో విష్ణు కాంపౌండ్లో మొదటిసారి కలవరం కనిపిస్తోంది. ఎలాగైనా సరే, ఈసినిమాకు హైప్ తీసుకురావాలన్న విషయంలో విష్ణు అండ్ కో తర్జన భర్జనలు పడుతున్నారు. తమ సినిమాలోని క్వాలిటీ చూపించడానికి మరో టీజర్ తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనల్లో ఉంది చిత్రబృందం. ఈసారైనా ప్రభాస్ ని కాస్త చూపిస్తే కనీసం ఆయన అభిమానులైనా సంతోషిస్తారు.