తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్గత రాజకీయాలు కాక మీద ఉన్నాయి. బయటకు తెలియడం లేదు కానీ .. కొన్ని కొన్ని సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి. 14నెలల క్రితమే నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయిన కల్వకుంట్ల కవిత పదవి కాలం ముగిసిపోయింది. డీఎస్ సన్నిహితుడు అయిన భూపతిరెడ్డిపై అనర్హతా వేటు వేయించి ఆ సీటును ఖాళీ చేసి కవితకు ఇచ్చారు. మిగిలిన సమయం ఆమె ఎమ్మెల్సీగా పదవిని అలంకరించారు.
ఇప్పడు ఆ ఎమ్మెల్సీ పదవి కూడా ముగియనుండటంతో ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసేశారు. ఇప్పుడు ఆమె మళ్లీ నిజామాబాద్ నుంచి పోటీచేస్తారా..? కేసీఆర్ చాన్స్ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆమెకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఈ విషయంలో కవిత కూడా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఆమె ఇటీవల ప్లీనరీకి కూడా హాజరు కాలేదు. కేటీఆర్‌ను సీఎం చేసే విషయంలో ఆమె అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయంటున్నారు.
ఆమెకు పదవి ఇచ్చే విషయంలో కేసీఆర్ అనేక అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేస్తున్నందు వల్ల … కవితను ఎమ్మెల్యే కోటా లేదా.. గవర్నర్ కోటా లేకపోతే మళ్లీ స్థానిక సంస్థల కోటాలో అయినా మండలికి పంపుతారని భావిస్తున్నారు. ఒక వేళ అలా పంపకపోతే టీఆర్ఎస్లో అంతర్గత రాజకీయాలుఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టమవుతుందంటున్నారు.